45 ఏళ్ళ 'మనుషులంతా ఒక్కటే'

45 ఏళ్ళ 'మనుషులంతా ఒక్కటే'

నటరత్న యన్.టి.రామారావుతో, దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన తొలి చిత్రం 'మనుషులంతా ఒక్కటే'. 1976 ఏప్రిల్ 7న విడుదలైన 'మనుషులంతా ఒక్కటే' చిత్రం విశేషాదరణ చూరగొంది. ప్రముఖ కళాదర్శకుడు రాజేంద్రకుమార్ కోరిక మేరకు యన్టీఆర్ కాల్ షీట్స్ ఇచ్చారు. ఈ  చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దాసరికి దక్కింది. సమర్థుడైన నటుడు లభిస్తే, ప్రతిభగల దర్శకుడు ఎలా ఉపయోగించుకుంటాడు అన్నదానికి నిదర్శనం 'మనుషులంతా 
ఒక్కటే' సినిమా. ఈ  చిత్రాన్ని జనం మెచ్చేలా  తీర్చిదిద్దారు దాసరి. 'మనుషులంతా ఒక్కటే' చిత్రం ఘనవిజయం సాధించి, నిర్మాతలకు లాభాలను ఆర్జించి పెట్టింది. దర్శకునిగా దాసరికి మంచి పేరు సంపాదించింది. 

రామారావు ఆశీస్సు...
నిజానికి యన్టీఆర్ ప్రోత్సాహంతోనే దాసరికి ఆత్మ విశ్వాసం కలిగింది.  యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'ఒకే కుటుంబం' చిత్రానికి భీమ్ సింగ్ దర్శకుడు. ఆ సినిమాకు దాసరి కో-డైరెక్టర్. ఆ చిత్రం షూటింగ్ లో ఉండగానే భీమ్ సింగ్ కు ఓ హిందీ సినిమా రూపొందించే అవకాశం దక్కింది. ఆ విషయాన్ని రామారావుకు చెప్పారు. ఆయన 'గో ఎ హెడ్' అంటూ ఆశీర్వదించారు. మిగిలిన చిత్రాన్ని భీమ్ సింగ్ అసోసియేట్ అయిన దాసరి పూర్తి చేశారు. ఆ సమయంలోనే రామారావు, దాసరిని "ఏదో ఒకరోజున మీరు దేశం గర్వించదగ్గ దర్శకుడవుతారు" అని దీవించారు. ఆయన వాక్కు వృథా కాలేదు. ప్రపంచంలోనే అత్యధిక కథాచిత్రాలు తెరకెక్కించిన దర్శకునిగా దాసరి నిలచిపోయారు. తనను అలా దీవించిన రామారావు చిత్రానికే దర్శకత్వం వహించే అవకాశం లభించగానే దాసరి ఎంతగానో పులకించిపోయారు. రామారావు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని 'మనుషులంతా ఒక్కటే' చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రిటిష్ వారి పరిపాలనలో సంస్థానాధీశులైన కొందరు నిరంకుశ ప్రభువుల తీరును ఇందులో ఎండగట్టారు. వారి కళ్ళు తెరిపించి, మనుషులంతా ఒక్కటే అని చాటేలా కథను రూపొందించారు. తన పంతం కోసం కన్నకొడుకునే కడతేర్చమని చెప్పిన ఓ కరడు కట్టిన నిరంకుశ జమీందార్ కు తరువాత ఆయన మనవడే వచ్చి, ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే ఈ కథ. 

ఈ చిత్రంలో యన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఆయన నాయికలుగా జమున, మంజుల కనిపించారు మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నగేశ్, రమాప్రభ, రాజశ్రీ అభినయించారు. 

యన్టీఆర్ సినిమా టైటిల్స్ తో దాసరి పాట... 
'మనుషులంతా ఒక్కటే' చిత్రానికి రచన, దర్శకత్వంతో పాటు ఓ పాటను రాశారు దాసరి. ఆ పాటతోనే గీత రచయితగా మారారు దాసరి. పైగా ఆ పాటలో యన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్ తోనే ఆ గీతాన్ని పూర్తి చేయడం విశేషం. "నిన్నే పెళ్ళాడతా...రాముడు-భీముడు, రాముని మించిన రాముడు..." అంటూ సాగుతుందీ పాట. ఇక సినారె కలం పలికించిన "అనుభవించు రాజా...", "తాతా...బాగున్నావా..." , "ఎవడిదిరా ఈ భూమి...ఎవ్వడురా భూస్వామి..." పాటలు అలరించాయి. కొసరాజు రాసిన "ముత్యాలు వస్తావా..." పాట, ఆత్రేయ కలం పలికించిన "కాలం కాదు కర్మా కాదు..." పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. తరువాతి కాలంలో ఈ సినిమా స్ఫూర్తితో అనేక చిత్రాలు తెరకెక్కడం విశేషం.