రివ్యూ: మన్మథుడు 2

రివ్యూ: మన్మథుడు 2

నటీనటులు: నాగార్జున‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌ కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

మ్యూజిక్: చైత‌న్‌ భ‌రద్వాజ్‌

సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌

నిర్మాత: మ‌నం ఎంట‌ర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌

దర్శకత్వం: రాహుల్ ర‌వీంద్రన్‌ 

రీమేక్ సినిమాలకు దూరంగా ఉండే నాగార్జున ఊపిరి సినిమాతో రీమేక్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  ఊపిరి ఫ్రెంచ్ మూవీ రీమేక్.  తరువాత ఇప్పుడు మన్మథుడు 2 సినిమాను కూడా ఫ్రెంచ్ సినిమా నుంచి తీసుకున్న కథతో తెరకెక్కించారు.. సినిమా ప్రారంభోత్సవం నుంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా..  ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.  

కథ: 

నాగార్జున కుటుంబం పోర్చుగల్లో స్థిరపడింది.  అక్కడే వ్యాపారం చేస్తుంటారు.  ప్రేమపై నాగ్ నమ్మకం లేదు.  ప్రేమ దోమ పక్కన పెట్టి తన ఆనందం కోసమే జీవిస్తుంటాడు.  వయసు మీదపడినా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడు.  ఎలాగైనా పెళ్లి చేయాలని ఇంట్లోవాళ్ళు చూస్తారు.  నాగ్ పై ఒత్తిడి తెస్తారు.  అయితే, నాగ్ మాత్రం వారి మాటల్ని పెడచెవిన పెట్టి జీవితాన్ని ఆస్వాదించడానికే ఎక్కువగ ప్రాధాన్యత ఇస్తాడు.  కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో.. రకుల్ ప్రీత్ ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాడు.  పెళ్లి సమయంలో ఎలా ఇంట్లోనుంచి బయటపడాలో ముందుగానే ప్లాన్ వేస్తారు.  రకుల్ తనకున్న సమస్యల కారణంగా నాగ్ చెప్పినదానికి ఒకే చేస్తుంది.  రకుల్ ప్రీత్ ఇంటికి వచ్చిన తరువాత అసలు ఏం జరిగింది..? ఒప్పందం ప్రకారం నాగార్జునకు రకుల్ ప్రీత్ దూరం అయ్యిందా ? ఇద్దరికి పెళ్లి జరిగిందా లేదా మిగతా కథ.  

విశ్లేషణ: 

నాగార్జున ప్లేబాయ్ పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.  ఈ సినిమాకు మన్మథుడు 2 అని పెట్టడానికి ఇదే కారణం కావొచ్చు.  నాగ్ వయసు 60 వస్తున్నా.. సినిమాలో యువకుడిలా కనిపించి మెప్పించాడు.  అయితే, పాత మన్మథుడు సినిమను దృష్టిలో పెట్టుకొని సినిమాకు వెళ్తే ఆ స్థాయికి పంచ్ డైలాగులు కనిపించవు.  ఈ మూవీ దానికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది.  నాగార్జునను రొమాంటిక్ యాంగిల్లో చూపించారు.  నాగ్ ప్లేబాయ్ అవతారం, వెన్నెల కిషోర్ కామెడీ, రకుల్ ప్రీత్ సందడితో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.  

సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలౌతుంది.  కామెడీతో పాటు సినిమాలో అసలైన భావోద్వేగాలు సెకండ్ హాఫ్ లోనే కనిపించాయి.  క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.  గతంలో ఇలాంటి కథలతో సినిమాలు వచ్చినా.. నాగార్జున లాంటి సీనియర్ నటుడు ఇలాంటి సినిమాలో నటించడం.. కామెడీని పండించడం అన్నది కొత్తగా ఉన్నది.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత సినిమాల్లో ఏ గ్రేడ్ కామెడీ ఎక్కువైంది.  ప్రతి సినిమాలో బీప్ సౌండ్ డైలాగులు పెడుతూండటం విశేషం.  యూత్ ను ఆకట్టుకోవడం కోసమే ఇలాంటి డైలాగులు వాడుతున్నారు.  

నటీనటుల పనితీరు: 

నాగార్జున ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ, బలం.  ప్లేబాయ్ పాత్రలో ఆయన్ను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది.  రొమాంటిక్ సన్నివేశాల్లో, ఎమోషన్ సన్నివేశాల్లో నాగ్ పర్ఫెక్ట్ గా నటించి మెప్పించాడు.  రకుల్ ప్రీత్ సింగ్ అందంతో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది.  వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.  సమంత, కీర్తి సురేష్ లు అతిధిపాత్రలో మెప్పించారు.  లక్ష్మి,  ఝాన్సీ, దేవదర్శిని తదితరులు వారి పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

చిలసౌ తరువాత రాహుల్ రవీంద్రన్ కు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఎలా ఉంటుందో అని అందరు ఎదురు చూశారు.  నాగార్జునను రొమాంటిక్ యాంగిల్లో అద్భుతంగా చూపించాడు.  కథను డీల్ చేసిన విధానం బాగుంది.  పోర్చుగల్ వంటి దేశాల్లో చిత్రీకరణ చేశారు.. అక్కడి అందాలను సినిమాటోగ్రాఫర్ సుకుమార్ తన కెమెరాలో బంధించిన తీరు ఆకట్టుకుంది.  చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

కామెడీ 

ఎమోషన్ 

మైనస్ పాయింట్స్: 

నవ్వించని కొన్ని సన్నివేశాలు 

చివరిగా: మన్మథుడు 2 - పర్వాలేదనిపించాడు.