అమ్మకానికి భార్య, పిల్లలు..!

అమ్మకానికి భార్య, పిల్లలు..!

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. జూదం, మద్యపానానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య పిల్లలను రూ.5 లక్షలకు తన అన్నకు అమ్మకానికి పెట్టాడు. బావ దగ్గర నుంచి తప్పించుకున్న ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వారు ఐసీడీఎస్‌ సంరక్షణలో ఉన్నారు.
బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి  వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.  మద్యానికి బానిసై అప్పులు చేసిన మద్దిలేటి.. ఆ అప్పులు తీర్చడానికి రెండో కుమార్తె(17)ను లక్షన్నరకు తన దూరపు బంధువుకు విక్రయించాడు. ఆ డబ్బును రోజుల్లో ఖర్చు పెట్టేసిన మద్దిలేటి.. మరింత డబ్బు కోసం తన మిగిలిన నలుగురు పిల్లలతోపాటు భార్యను రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టాడు. సంబంధిత పత్రాలపై సంతకం చేయాలంటూ భార్యను వేధించాడు. 'నువ్వు సంతకం పెట్టి.. మా అన్న దగ్గరకు పిల్లలను తీసుకెళ్లిపో' అంటూ ఒత్తిడి చేశాడు. 
ఆ తర్వాత బాధితురాలు వెంకటమ్మ.. ఐసీడీఎస్‌ అధికారులను ఆశ్రయించింది. బాధితురాలితో రాత పూర్వకంగా రాయించుకున్న ఐసీడీఎస్‌ అధికారులు.. పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.