షాకింగ్ : విద్యా సంస్థల ఆధినేత ఆత్మహత్య

షాకింగ్ :  విద్యా సంస్థల ఆధినేత ఆత్మహత్య

ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. మృతుడు పీలేరులోని ఎంజెఎం ఇంజినీరింగ్ కళాశాల నిర్వహకుడు వెంకట రమణా రెడ్డిగా గుర్తించారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె చెందిన వెంకటరమణారెడ్డి పీలేరు - కల్లూరు మార్గంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. గురువారం నాడు కళాశాల ముగిసిన అనంతరం కారులో పులిచెర్ల మండలం  కోడిది పల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు. అక్కడ కారు దిగి నాకు తినడానికి ఏమైనా తీసుకురమ్మని డ్రైవర్ ను పంపించారు. తిరుపతి నుంచి గుంతకల్ వెళ్లే ప్యాసింజర్ రైలు వచ్చే సమయం కావడంతో రైల్వే గేట్ సమీపంలో ఉండవద్దని రైల్వే సిబ్బంది రమణ రెడ్డిని కోరారు.. దీంతో ఆయన ట్రాక్ పక్కనుంచి నడుస్తూ పీలేరు వైపు కొంత వెళ్లారు..సరిగ్గా రైలు వచ్చే సమయానికి పట్టాలపైకి దూసుకురావడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొని సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. రైలు వేగం తాకిడికి ఆయన శరీరభాగాలు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వెంకట రమణారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.