ప్రాణం తీసిన కుల బషిష్కరణ.. ఆ డబ్బుంటే బతికేవాడేమో ?

ప్రాణం తీసిన కుల బషిష్కరణ.. ఆ డబ్బుంటే బతికేవాడేమో ?

ఉమ్మడి మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన  ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన ఆత్మహత్య కు ముందు తీసుకున్న ఓ సెల్పీ వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ ని ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. కోర్టుకు తీసుకెళ్లడంతో.. విచారణలో  వాదోపవాదాలు విన్న తర్వాత ఇప్ప శంకర్ ను కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. అయితే కేసు నమోదు కాగానే శంకర్ కుటుంబం మొత్తాన్ని గ్రామానికి చెందిన వారి ముది రాజ్ కులస్తులు కులబహిష్కరణ చేశారు. 

అయితే కోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చిన తర్వాత కుల పెద్దలను ఆశ్రయించారు. తాను నిర్దోషిని అని తనను తమ కుటుంబటన్ని  కులంలో కలుపుకోవాలని కోరారు. దీంతో గ్రామానికి చెందిన ముగ్గురు కులపెద్దలు అందరితో మాట్లాడి.. రూ. 5లక్షలు చెల్లిస్తే కులంలో కలుపుకుంటామనే నిబంధన పెట్టారు‌. దీంతో అంత భారీ మొత్తం కట్టలేని స్థితిలో ఉన్న శంకర్  జనవరి 6న అల్లదుర్గం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు. తమ కుల పెద్దలు కావాలనే తమను కుల బహిష్కరణ చేశారని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా పోలీసులు సరిగా స్పందించలేదు. దీనికి తోడు కోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చిన తర్వాత శంకర్ కు వారి కుటుంబ సభ్యలు  పెళ్లి చేశారు. ఆ తరువాత 3 రోజులకే శంకర్ భార్య శంకర్ ను వదిలి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

దీంతో అప్పటి నుంచి అటు కుల బహిష్కరణ, ఇటు భార్య వదిలివెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్ సోమవారం  అర్ధరాత్రి తమ వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   శంకర్ ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆవేదన మొత్తాన్ని చెబుతూ..  ఓ సెల్పీ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో లో ప్రస్తుత తరుణంలో ఆడవాళ్లను నమ్మవద్దని, తనను గ్రామ కుల పెద్దలు కావాలనే కులం నుంచి బహిష్కరించారనీ తీవ్ర ఆవేదనతో వివరించాడు.

కుల బహిష్కరణ విషయంలో అల్లాదుర్గ్ పోలీసులకు వివరించినా పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. తన చావుకు కుల పెద్దలు, అల్లాదుర్గ్ పోలీసులే కారణమని చెబుతున్న వీడియో ఇప్పడు వైరల్ గా మారింది. ఉదయం శంకర్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలిలో మృతుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే  ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పికెటింగ్ ఏర్పాటు చేశారు.