హాట్ టాపిక్‌గా మారిపోయిన దీదీ సీటు.. విజయం దక్కేనా..?

హాట్ టాపిక్‌గా మారిపోయిన దీదీ సీటు.. విజయం దక్కేనా..?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హీట్‌ పెరిగింది. నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానన్న మమత బెనర్జీ కామెంట్స్‌తో ఇప్పుడు అందరి దృష్టి ఆ సీట్‌పై పడింది. అటు దీదీ మాజీ అనుచరుడు.. ఇటు బెంగాల్‌ సీఎం.. దీంతో నందిగ్రామ్‌ పోరు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. బెంగాల్‌ కా బేటీ అంటూ దీదీ చెబుతుంటే.. మమతను ఓడిస్తానంటూ శపథం చేస్తున్నాడు సువెందు అధికారి. తన అడ్డాలో విక్టరీ ఈజీ కాదంటున్నాడు. తృణమూల్‌ కాంగ్రెస్‌ని అధికారంలోకి నిలబెట్టిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. ఎకానమిక్‌ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా నిలిచింది తృణమూల్‌ కాంగ్రెస్‌. అదే 2011లో టీఎమ్‌సీని అధికారంలో కూర్చొబెట్టింది. నాటి రైతుల ఆందోళనలకు టీఎమ్‌సీ అండగా నిలిచింది. మమత అనుచరుడిగా ఇక్కడి రైతాంగ పోరాటానికి నాయకుడిగా నిలిచింది మాత్రం సువెందు అధికారియే..! మా మాట్టి.. మా మనుషులు అంటూ దీదీతో కలిసి సువెందు చేసిన పోరాటం.. ఆయన్ను అక్కడ తిరుగులేని నేతగా తయారు చేసింది. 2009లో ఉప ఎన్నిక నుంచి సువెందు అక్కడ ఓడిపోలేదు. తర్వాత ఎన్నికల్లో ఆయన మెజార్టీ పెరుగుతూనే వస్తోంది. ఈ పోరాటం తర్వాతే దీదీకి దగ్గరయ్యాడు. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. సువెందుకు సైడ్ మార్చాడు. తృణమూల్‌ నుంచి బయటికొచ్చి.. బీజేపీలో చేరాడు. అటు సువెందును కూడా బీజేపీ ప్రముఖంగా ప్రొజెక్ట్‌ చేస్తోంది. ఎలాగైనా బెంగాల్‌ను దక్కించుకోవాలని భావిస్తున్న కమలనాధులు.. సువెందును ప్రోత్సహిస్తున్నారు. అందుకే మమత నందిగ్రామ్‌లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తానంటూ ప్రకటనలు గుప్పించాడు. కానీ మమత మాత్రం ఈ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్నారు. వస్తున్నా.. కాచుకో అంటూ ఇవాళ తేల్చేశారు. 

తన వెనుక ఉండి పార్టీ మారిన అందరికీ గుణపాఠం చెబుతానంటున్నారు. నందిగ్రామ్‌లో పోటీ చేస్తానన్న మమత ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది. తన అనుచరుడే.. అక్కడ తిరుగులేని నేత..! అందుకే మమత కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బెంగాలీ బిడ్డను అంటూ సెంటిమెంట్‌ టచ్‌ చేస్తున్నారు. నందిగ్రామ్‌ అంటే ఇష్టమంటున్నారు. తన లక్కీ ప్లేస్‌ అని చెబుతున్నారు. అటు టీఎమ్‌సీ వర్గాలు కూడా మమత పోటీని సీరియస్‌గా తీసుకున్నారు. అసలు ఇక్కడి నుంచి పోటీ చేస్తానెమో అంటూ దీదీ జనవరిలో చెప్పారు. అప్పటి నుంచే టీఎమ్‌సీ శ్రేణులు వేగంగా పావులు కదుపుతున్నారు. నందిగ్రామ్‌లో రెండు ఇళ్లను దీదీ కోసం రెంట్‌కి తీసుకున్నారు. అంతేకాదు.. కేడర్‌ను సిద్ధం చేశారు. అటు సువెందు అధికారి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటనలు గుప్పిస్తున్నారు. అటు బీజేపీ హైకమాండ్‌ కూడా దీదీపై సువెందును దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా నందిగ్రామ్‌ సమరం రసవత్తరంగా మారింది. అటు మమత బెనర్జీ.. ఇటు సువెందు అధికారి.. ఎవరి లెక్కలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే 2011లో టీఎమ్‌సీ గద్దెనక్కించిన నందిగ్రామ్‌.. 2021లో ఎవరి వైపు మొగ్గుతుంది..? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకే మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. సవాళ్లు సెగలు రేపుతున్నాయి.