మంత్రి అయ్యాకే అసలు రాజకీయం స్టార్ట్‌ చేశారా?

మంత్రి అయ్యాకే అసలు రాజకీయం స్టార్ట్‌ చేశారా?

మేడ్చల్‌ జిల్లా రాజకీయాలన్నీ ఇప్పుడు మంత్రి చామకూర మల్లారెడ్డి  కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. టీడీపీ నుంచి ఎంపీ అయిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆపై ఎమ్మెల్యే గెలిచి కేబినెట్‌లో చోటు సంపాదించారు. మంత్రి అయ్యాక మల్లారెడ్డి అసలు రాజకీయం స్టార్ట్‌ చేశారని పార్టీ వర్గాలు చెప్పుకొంటాయి. మంత్రి కాగానే వచ్చిన సర్పంచ్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను మల్లారెడ్డి మద్దతుదారులు జిల్లాలో కైవశం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌  కోసం టీఆర్‌ఎస్‌లో హేమాహేమీలు పోటీపడ్డారు. అయినా తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించుకున్నారాయన. పార్టీ పెద్దల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకూ అందరూ కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు. అయినా స్వల్ప తేడాతో రాజశేఖర్‌రెడ్డి ఓడిపోయారు.

ఎంపీ ఎన్నికల హ్యాంగోవర్‌ నుంచి బయటపడేలోగానే మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లోనూ సమీప బంధువులు, అనుయాయులకే టికెట్లు ఇప్పించుకున్నారని మల్లారెడ్డిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ల కోసం జరిగిన ఘర్షణలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. ఒక్కో టికెట్‌ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ తీసుకున్నట్లు ఆడియో టేపులు వెలుగు చూడటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఉద్యమకారులు, పార్టీలోని సీనియర్లు కాదని కేవలం బంధువులు, డబ్బులున్నవారికే టికెట్లు ఇప్పించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో అధిష్ఠానం కూడా మంత్రి మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటారు.

ఇవే కాదు.. కో ఆపరేటివ్‌ ఎన్నికల్లో కూడా తన సామాజికవర్గం వారిని.. బంధువులను  ఎన్నికల్లో పోటీ చేయించారనే విమర్శలు మంత్రిపై ఉన్నాయి. తాజాగా  మేడ్చల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌గా మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేశారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ వ్యవహారాలను చూస్తున్న మహేందర్‌రెడ్డికి సైతం రానున్న రోజుల్లో నామినేటెడ్‌ పోస్టు ఇప్పించుకోవాలని మంత్రి చూస్తున్నారట. మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ వ్యవహారాలు చూసుకుంటున్న మంత్రి మరో కుమారుడు భద్రారెడ్డిని సైతం త్వరలో పార్టీ పదవి వరించే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా మంత్రి కుమార్తె మమతారెడ్డి సైతం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారట. ఆమె రాక కోసం తండ్రి మల్లారెడ్డి మార్గం సుగమం చేస్తున్నట్లు టాక్‌ ఉంది. అయితే, వారికే పదవులు కట్టబెడుతుండటంపై సొంతపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.