మహేష్, త్రివిక్రమ్ మూవీ 'పార్ధు'

మహేష్, త్రివిక్రమ్ మూవీ 'పార్ధు'

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో ఇంతకు ముందు 'అతడు, ఖలేజా' సినిమాలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతోంది. అయితే తొలి రెండు సినిమాలు మహేశ్ కి ఆశించిన స్థాయిలో హిట్ ని అందించలేక పోయాయి. టీవీలలో సూపర్ హిట్ అనిపించుకున్న ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం సత్తా చాటలేక పోయాయి. ఇప్పుడు మహేశ్ తోపాటు త్రివిక్రమ్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇద్దరి సినిమాలు వరుసగా హిట్ అవుతూ వస్తున్నాయి. అందుకే  వీరి కాంబినేషన్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. 'ఖలేజా' తర్వాత పదకొండు సంవత్సరాల గ్యాప్ తో మహేశ్, త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. 

ఈ తాజా సినిమాకు 'పార్థు' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. నిజానికి పార్థు అనేది వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా 'అతడు'లో మహేష్ క్యారెక్టర్ పేరు. కొన్ని వేలసార్లు టీవీల్లో ప్రదర్శితమై ఆడియన్స్ లో ఆ పేరు బలంగా నాటుకు పోయి ఉంది. అందుకే ఆ పేరు అయితే ఈజీగా జనాల్లోకి వెళుతుందనే అభిప్రాయంతో ఉన్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. మరి మహేశ్ 'పార్థు'గానే సందడి చేస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.