సంగీత తరంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి

సంగీత తరంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి "మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి" .. అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించిన సంగీత సరస్వతి.  కర్ణాటక సంగీత విదుషీమణి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మీ జయంతి నేడు. 1916 సెప్టెంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది సుబ్రమణ్య అయ్యర్, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివూ అమ్మాళ్ కు జన్మించారు. పదేళ్ళ ప్రాయం నుంచే ఎంఎస్ సుబ్బులక్ష్మీ సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. పదేండ్ల వయస్సులో తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్‌ గుడిలోని వందస్తంభాల హాలులో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.కర్ణాటక సంగీత శాస్త్రీయ, ఆర్థశాస్త్రీయ గీతాలాపనలో నేటికి ఆమెకు సారిరారు ఏనాటికి అనేవిధంగా ఆమె గాత్రం అజరామరంగా సాగింది.స్వాతంత్య్ర సమర యోధుడు, ఆనంద వికటన్‌ పత్రిక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన సదాశివన్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి.  అంతే కాకుండా రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి, అంతర్జాతీయ సంగీత ప్రపంచములో అత్యున్నత స్థానాన్ని పొందింది, ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు.1938లో సినీ సంగీతంలోకి అడుగు పెట్టారు. 'సేవాసదనం' అనే చిత్రం ద్వారా సినీ గాయకురాలిగా పరిచయం అయిన సుబ్బులక్ష్మి 1940లో 'శకుంతలై' అనే చిత్రంలో గాయకురాలిగా తెరపై కనిపించారు. అంతేకాదు 1945లో "మీరా" అనే చిత్రంలో మీరాబాయిగా నటించి జాతీయ గుర్తింపు పొందారు.రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన ఇచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది ఎంఎస్ సుబ్బులక్ష్మీ. ప్రపంచ స్థాయిలో ఆబాలగోపాలాన్నిఅలరించిన ఆ స్వరం 2004 డిసెంబర్ 11న మూగబోయింది. ఇప్పటికీ ప్రతి ఇంటా తెల్లవారు జామునుంచే "కౌశల్యా సుప్రజా రామా" అంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి స్వరం  ప్రతి మదిని మీటుతూనే ఉంది.