గడ్కరీతో ఆర్ఎస్ఎస్ కీలక నేత భేటీ

గడ్కరీతో ఆర్ఎస్ఎస్ కీలక నేత భేటీ

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మే 23న జరిగే ఓట్ల లెక్కింపుపైనే నిలిచింది. ఈ రాజకీయ కోలాహలం కొనసాగుతుండగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్ ఛార్జి, బీజేపీ దిగ్గజ నేత కైలాష్ విజయవర్గీయ్ కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ జరిగిందని భావిస్తున్నారు.


పోలింగ్ తర్వాత సంఘ్ లో నెంబర్ టూగా గుర్తింపు పొందిన భయ్యాజీ జోషీ మాట్లాడుతూ తాను అభివృద్ధికి ఓటు వేసినట్టు చెప్పారు. అభివృద్ధి వేగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రంలో మరోసారి బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్నికల సందర్భంగా నితిన్ గడ్కరీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలుపుతారని మరోసారి చర్చలు జరిగాయి. అయితే ప్రధాని అభ్యర్థి రేసులో తాను లేనని గడ్కరీ స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ తర్వాత భయ్యాజీ జోషీ గడ్కరీని కలవడంతో మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ భేటీలో ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్టు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే ఏం చేయాలనే విషయాన్ని చర్చించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

ఏడో దశ ఓటింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీఏలకు పూర్తి మెజారిటీ వస్తుందని తెలిసింది. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకి 300కి పైగా సీట్లు వచ్చేలా ఉన్నాయి. యుపిఏకి 127 స్థానాలు దక్కనున్నట్టు అంచనా. ఇప్పుడు అందరి చూపులు మే 23న  వచ్చే ఫలితాలపైనే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 435 సీట్లలో తన అభ్యర్థులను నిలిపింది. మిగిలిన సీట్లను బీజేపీ తన భాగస్వామ్య పక్షాలకు వదిలేసింది. కాంగ్రెస్ మొత్తం 420 సీట్లలో పోటీ చేసింది.