మార‌టోరియం.. స‌మ‌యం కోరిన కేంద్రం.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్...

మార‌టోరియం.. స‌మ‌యం కోరిన కేంద్రం.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్...

క‌రోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఉద్యోగుల‌తో పాటు వ్యాపారుల‌పై గ‌ట్టిగానే ప‌డింది.. దీంతో వారు చెల్లించాల్సిన ఈఎంఐల‌పై వెసులుబాటు క‌ల్పించేవిధంగా మార‌టోరియం తీసుకొచ్చింది ఆర్బీఐ.. అయితే, మార‌టోరియం స‌మ‌యంలో వ‌డ్డీ విష‌యంపై నిర్ణ‌యం వాయిదా ప‌డుతూనే ఉంది.. తాజాగా.. బుధ‌వారం సాయంత్రం ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి.. అమలుకు నవంబర్ 15వ తేదీ వరకు సమయం కావాల‌ని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టును కోరింది కేంద్రం.. అయితే, నవంబర్ 2వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది సుప్రీం ధర్మాసనం. 

రూ. 2 కోట్ల లోపు బ్యాంకు రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీని జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు.. నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేసేందుకు నెల ఆలస్యం ఎందుకని ప్ర‌శ్నించింది ధర్మాసనం. అయితే, తీసుకున్న నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, చిన్న చిన్న మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరేలా, అన్ని నియమనిబంధనలకు అనుగుణంగా, తగు జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకునేందుకు సమయం కావాల‌ని సుప్రీంకోర్టును కోరింది కేంద్రం.. కానీ, కేంద్ర వాదనను తోసిపుచ్చుతూ, అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులు ఉంటాయని.. బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు సొలిసినటరీ జనరల్ తెలిపారు.. అయితే, కేంద్ర నిర్ణయం అమలుపై సామాన్యుల్లో నెలకున్న ఆందోళన.. సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నాం.. కానీ, త్వరగా అమలు చేయాల‌ని సుప్రీం ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు జస్టిస్ ఎమ్.ఆర్. షా.. నవంబర్‌ 15 వరకు సమయం ఇవ్వాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనాన్ని కేంద్రం కోర‌గా.. కుదరదన్న సుప్రీం ధర్మాసనం.. న‌వంబ‌ర్ 2 డెడ్‌లైన్‌గా పెట్టింది.