కోదండరాం కు షాక్ ఇచ్చిన వామపక్షాలు...

కోదండరాం కు షాక్ ఇచ్చిన వామపక్షాలు...

ప్రొఫెసర్‌కు లెఫ్ట్‌ పార్టీలు హ్యాండిచ్చాయా? మొదటిసారి ఆయనతో విభేదించి రాంరాం చెప్పేశాయా? ఇద్దరి మధ్య గ్యాప్‌ ఎందుకొచ్చింది? తెరవెనక ఏం జరిగింది? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మారిన పరిణామాలేంటి? లెట్స్‌ వాచ్‌!

కోదండరామ్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన లెఫ్ట్‌ పార్టీలు!

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఊహించని రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు ప్రొఫెసర్‌ కోదండరామ్‌. కాంగ్రెస్‌పార్టీ మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. లెఫ్ట్‌ పార్టీల మద్దతు కూడా కోదండరామ్‌కే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ.. CPI, CPMలు ట్విస్ట్‌ ఇచ్చాయి. సీపీఐ బలపరిచిన జర్నలిస్ట్‌ జయసారధికి మద్దతిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. ఒక్క న్యూ డెమోక్రసీ మాత్రమే కోదండరామ్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటన చేసింది. దీంతో ఖమ్మం జిల్లాలో లెఫ్ట్‌ పార్టీల నిర్ణయం  రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐకి సీపీఎం మద్దతు!

CPI, CPMలకు ఖమ్మం జిల్లాలో కేడర్‌ ఉంది. ఏ ఎన్నికైనా ఒకరికొకరు సహకరించుకునే ఈ రెండు లెఫ్ట్‌ పార్టీలు 2014 ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించాయి. ఆ ఎన్నికల్లో  సీపీఐ కాంగ్రెస్‌కు, సీపీఎం వైసీపీకి మద్దతు తెలియజేశాయి. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లోనూ ఎవరిదారి వారిదే. చిన్నా చితక 14 పార్టీలతో సీపీఎం కూటమి కడితే..  సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో దోస్తీ చేసింది. అలా  చెరో దారిలో పయనిస్తున్న సమయంలో CPI బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థికి సీపీఎం మద్దతు తెలియజేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది. 

ప్రొఫెసర్‌కు సీపీఐ, సీపీఎం కటీఫ్‌!

ఈ నియోజకవర్గ పరిధిలో ఏడాది క్రితం జరిగిన టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం నిలబెట్టిన నర్సిరెడ్డి గెలిచారు. తమకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉందని ఆ పార్టీ నిరూపించింది. అలాంటి సీపీఎం.. సొంత అభ్యర్థిని బరిలో దించకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచిందట. అంతేకాదు.. సీపీఐకి మద్దతిస్తూ తీసుకున్న నిర్ణయం కొందరికి రుచించడం లేదట. పైగా కమ్యూనిస్ట్‌ పార్టీలలో కీలకమైన CPI, CPM రెండూ ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కటీఫ్‌ చెప్పడమే ఎవరికీ అంతుచిక్కడం లేదట. 

కోదండరామ్‌కు కాంగ్రెస్‌ మద్దతిస్తుందా? 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐతో సీపీఎం కలవడం ఓ ఎత్తు అయితే.. ప్రొఫెసర్‌కు మద్దతివ్వకుండా వేరుగా అభ్యర్థిని బరిలో దింపడం మరో ఎత్తు. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా తన నిర్ణయం ఏంటో ప్రకటించ లేదు. సొంతంగా అభ్యర్థిని బరిలో దించుతుందా? లేక కోదండరామ్‌కు మద్దతిస్తుందా అన్నది  తేలాల్సి ఉంది. దీనిపై ఓ కమిటీని కూడా వేసింది కాంగ్రెస్‌. 

లెఫ్ట్‌ పార్టీల నిర్ణయంతో విపక్ష ఓటు చీలుతుందా?

ఇదే స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పార్టీలు కోదండరామ్‌కు మద్దతిచ్చి ఉంటే పరిణామాలు మరో ఉండేవి. కానీ.. లెఫ్ట్‌ పార్టీల నిర్ణయం తర్వాత విపక్ష ఓటు చీలే పరిస్థితి కనిపిస్తోంది. కోదండరామ్‌కు  లెఫ్ట్‌ పార్టీలకు మధ్య గ్యాప్‌ వచ్చిన ఉదంతాలు ఇటీవల ఏమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న రెండు పక్షాలు ఈ విధంగా భిన్నవైఖరి తీసుకోవడమే ఆసక్తి కలిగిస్తోంది. మరి.. ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో ఫలితాలే నిర్ణయిస్తాయి.