చిత్తూరు జిల్లాలో రెవెన్యూ అధికారులపై నేతల ఒత్తిళ్లు!

చిత్తూరు జిల్లాలో రెవెన్యూ అధికారులపై నేతల ఒత్తిళ్లు!

అధికారులపై నేతల ఒత్తిళ్లు సహజం. అధికార పార్టీ నాయకుల నుంచి ఈ తరహా ఒత్తిళ్లు వస్తుంటాయి. ఇవి శ్రుతి మించితేనే ఇబ్బంది. చిత్తూరు జిల్లాలో అదే జరుగుతోందట. చెప్పినట్టు వినకపోతే ఎంతకైనా తెగించడం... ఉద్యోగ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ మారింది. 

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు!

చిత్తూరు జిల్లా రెవెన్యూ శాఖలో తహశీల్దార్లుగా పనిచేయాలంటే అధికారులు హడలిపోతున్నారు. కార్యాలయంలో ఏం జరిగినా తమకు తెలియాలని.. తాము చెప్పినట్టే వినాలన్న హుకుం జారీ చేస్తున్నారు నాయకులు. మాట వినకపోతే బదిలీవేటు తప్పదని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ లాంటి కీలక సవాళ్లును అధికారులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఒత్తిళ్ల మధ్య అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు మరోలా ఉండటంతో రెవెన్యూ ఉద్యోగులకు ఏం పాలుపోవడం లేదట. 

సీఎం సభకు వచ్చిన అధికారుల్లో ఇదే చర్చ!

ఈ ఏడాది జిల్లాలో నలుగురు తహశీల్దార్ల పై బదిలీ వేటు పడింది. ఎప్పుడు ఎవరిని బదిలీచేస్తారో..? ఎవరిపై చర్యలు తీసుకుంటారో తెలియడం లేదట. నేతల ఒత్తిళ్లపై ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మొన్నటి సిఎం సభకు హాజరైన రెవెన్యూ అధికారుల్లోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇళ్ల పట్టాలపై సీఎం ప్రసంగిస్తుంటే.. మీ డివిజన్‌లో పరిస్థితి ఎలా ఉంది అంటే మీ దగ్గర ఎలా ఉందని ఒకరి బాధలు మరొకరు చెప్పుకొన్నారు అధికారులు. 

నేతల మాట వినకపోతే డిప్యూటేషన్‌పై పంపేస్తున్నారు!

చిత్తూరు జిల్లాలో 66 మండలాలు ఉండగా కేవలం 8 మంది రెగ్యులర్ తహశీల్దార్లే పనిచేస్తున్నారు. 42 చోట్ల డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. ఆరు మండలాల్లో ఇంఛార్జ్‌లు.. మరో ఐదుగురు కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో తహసీల్దార్లను ఇష్టారీతిన బదిలీ చేస్తున్నారట. ఆయా మండలాల్లో అధికార పార్టీ నాయకుల మాట వినని వారిని డిప్యుటేషన్‌పై మరో చోటుకు పంపేస్తున్నారు. రాత్రికి రాత్రే మండలం మార్చేసి.. నచ్చిన అధికారులను తీసుకొస్తున్నట్టు ఉద్యోగ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

నేతల మాట వింటే రీసర్వేలో యాజమాన్య హక్కులు మారిపోతాయా?

ముఖ్యంగా DKT, ప్రభుత్వ భూములను నేతలు చెప్పిన వారి పేరు మీద రాయకపోతే బదిలీ చేయడానికి క్షణం ఆలోచించడం లేదట.  పూతలపట్టు, చంద్రగిరి, మదనపల్లె, పీలేరు, కుప్పం, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఈ తరహా ఇబ్బందులు శ్రుతి మించుతున్నట్టు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తున్న మాట. భూముల రీసర్వేను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమయంలో  తహాశీల్దార్లును ఇష్టారీతిన మార్చడంపై ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందట. నాయకుల మాట విని రీ సర్వే చేస్తే భూముల యాజమాన్య హక్కులు మారిపోయే ప్రమాదం ఉందని.. తర్వాతి రోజుల్లో ఇది తమ మెడకు చుట్టుకుందని భయపడుతున్నారట అధికారులు. 

పట్టించుకోని రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు?

ఈ అంశంపై రెవెన్యూ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతోందట. ఇప్పటికే రెవెన్యూ అసోసియేషన్‌కు సంబంధించిన నేతలకు తెలియజేశారట ఉద్యోగులు. కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం. దీంతో తమ గోడును ఉన్నతాధికారులకు చెప్పలేక.. అధికార పార్టీ నేతల మాటను కాదన లేక చాలా మంది నలిగిపోతున్నారట. అందుకే ఈ సమస్య నుంచి ఎవరు గట్టెక్కిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అధికారులు.