మలింగ సూపర్‌ షో.. 10/83

మలింగ సూపర్‌ షో.. 10/83

ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లతోపాటు ప్రపంచవ్యాప్తంగా టీ20 టోర్నీల్లో ఆడే ఈతరం క్రికెటర్లకు గ్యాప్‌ దొరికితే గగనమే. రోజుకో మ్యాచ్‌ కూడా ఆడాల్సిన పరిస్థితి. శ్రీలంక స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ.. గంటల వ్యవధిలో రెండు మ్యాచ్‌లు ఆడి సత్తా చాటాడు. అదీ.. ఒకటి ఇండియాలో.. మరొకటి శ్రీలంకలో..! 

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన మలింగ.. మ్యాచ్‌ ముగిసిన వెంటనే స్వదేశం బయలు దేరాడు. అర్ధరాత్రి1.40కి భారత్‌లో బయలుదేరి  గురువారం వేకువ జామున 4.30కి శ్రీలంక చేరుకున్నాడు. దిగీదిగగానే.. ఉదయం 7 గంటలకు వన్డే సూపర్‌ ఫోర్‌ ప్రొవిన్షియల్‌ టోర్నీలో ఆడాడు. విశ్రాంతి లేకుండానే బరిలోకి దిగినా.. బంతితో చెలరేగారు. గాలె జట్టు తరఫున గ్రౌండ్‌లోకి దిగిన మలింగ.. 49 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి భారీ విజయాన్ని అందించాడు. అంటే.. సుమారు 10 గంటల గ్యాప్‌లో 10 వికెట్లు తీశాడు. 35 ఏళ్ల వయసులోనూ తాను ఎంత ఫిట్‌గా ఉన్నదీ చాటి చెప్పాడు.

ఐపీఎల్‌ కోసం భారత్‌కు వచ్చిన మలింగ.. దేశవాళీ వన్డే టోర్నీ ఆడేందుకు అతడిని శ్రీలంక బోర్డు వెనక్కి పిలిపించింది. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని స్వదేశంలో సూపర్‌ ప్రొవిన్సియల్‌ వన్డే టోర్నీలో అతణ్ని ఆడించాలని నిర్ణయించింది.