వేడెక్కిన బీహార్ రాజకీయం.. క్షుద్ర పూజల కలకలం !

వేడెక్కిన బీహార్ రాజకీయం.. క్షుద్ర పూజల కలకలం !

బీహార్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో అధికార విపక్షాలు దూకుడు పెంచాయి. ప్రచార సభలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని దుండగులు కాల్చి చంపడం కలకలం రేపింది. బీహార్‌లో ఈనెల 28న తొలివిడత పోలింగ్‌ జరగనుంది.దీంతో  రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయ్‌. పోటాపోటీ ప్రచారాలు సాగుతున్నాయి.  

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ ఆలయాల చుట్టూ తిరుగుతోంది. లోక్‌జనశక్తి పార్టీ సీతమ్మ తల్లికి గుడి కడతామనే నినాదాన్ని తీసుకొచ్చింది. అయోధ్యలో నిర్మితమౌతోన్న రామమందిరానికి మించిన స్థాయిలో సీతమ్మ తల్లికి ఆలయాన్ని కట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తామంటున్నారు  లోక్‌జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్. అంతేకాదు నితీష్‌ను జైలుకు పంపతామని సంచలన కామెంట్స్‌ చేశారు.

 అటు బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు.  ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ... తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. జేడీయూ అధినేత నితీశ్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీయే ఎల్‌జేపీని బీ టీమ్‌గా బరిలో దింపిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రచారం జరుగుతుండగానే జనతాదళ్ రాష్ట్రవాది అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ సింగ్ ను దుండగులు కాల్చి చంపడం కలకలం రేపింది.

కార్యకర్తల్లో కలిసిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులోపోలీసులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మంత్రాలు, చేతబడి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.తనను చంపడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ సీనియర్ బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఆరోపించడం దుమారం రేపింది. అయితే ఈ వ్యాఖ్యలు వికారం పుట్టించేలా ఉన్నాయని, సుశీల్ మోడీ ఇంతలా దిగజారి మాట్లాడుతారనుకోలేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.