మరో బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం.. ఖాతాదారులపై తీవ్ర ప్రభావం..!

మరో బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం.. ఖాతాదారులపై తీవ్ర ప్రభావం..!

మరో ప్రైవేట్‌ బ్యాంకు ఖాతాదారులకు షాక్‌ ఇస్తూ... మారటోరియం విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)... ప్రైవేటు యాజమాన్యంలోని లక్ష్మీవిలాస్ బ్యాంక్‌పై ఇవాళ్టి నుంచి డిసెంబరు 16 వరకు ఆర్బీఐ తాత్కాలికంగా మారటోరియం విధించింది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి ఈ మారటోరియం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖలోని బ్యాంకింగ్‌ డివిజన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మారటోరియం నెల రోజుల పాటు అంటే వచ్చే డిసెంబర్‌ 16వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. తమిళనాడులోని కరూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌ను టేకోవర్‌ చేసేందుకు అనేక కంపెనీలు ప్రయత్నించాయి. అనేక కారణాలతో సదరు టేకోవర్లను తిరస్కరించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్... మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆచరణీయమైన ఎటువంటి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం, పురోగతి క్షీణించడం, నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏఎస్) పెంచడం కారణంగా బ్యాంకుపై తాత్కాలికంగా మారటోరియం విధించినట్టు ఆర్బీఐ పేర్కొంది. 

ఇక, ఆర్బీఐ తాత్కాలిక మారటోరియం విధించడంతో.. లక్ష్మీవిలాస్ బ్యాంక్‌ ఖాతాదారులు రూ. 25 వేలకు మించి క్యాష్‌ విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది. సేవింగ్‌, కరెంట్‌, డిపాజిట్‌ ఖాతా ఏదైనా సరే రూ. 25,000 మించి విత్‌డ్రా చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఒకే డిపాజిటర్‌కు పలు ఖాతాలు ఉన్నా... గరిష్టంగా రూ. 25,000 మించి ఇవ్వరాదని స్పష్టం చేసింది. అయితే, డిపాజిటర్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చులకు, లేదా డిపాజిటర్‌పై ఆధారపడిన వ్యక్తి మెడిల్‌ ట్రీట్‌మెంట్‌ కోసం రూ. 25,000 మించి ఇవ్వొచ్చని పేర్కొంది. డిపాజిటర్‌ పెళ్ళికి/ ఇతర ఫంక్షన్లకు, అలాగే డిపాజిటర్‌పై ఆధారపడిన వ్యక్తి పిల్లల వివాహం లేదా ఇతర ఫంక్షన్లకు కూడా పరిమితి మించి ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆర్థిక శాఖ. అయితే, గరిష్ఠంగా రూ. 5 లక్షలకు మించరాదని కూడా షరతులు పెట్టింది ఆర్థికశాఖ.