11 ఏళ్ల తర్వాత కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కు మోక్షం

11 ఏళ్ల తర్వాత కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కు మోక్షం

కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కు 11 ఏళ్ల తర్వాత ఎట్టేకేలకు ఎన్నికలకు మోక్షం వచ్చింది. దీంతో కర్నూలు నగరంలో ఎన్నికల వేడి మొదలయింది. ఇప్పటి నుండే కర్నూలు మేయర్ కుర్చీ సొంతం చేసుకోడానికి రాజకీయపార్టీలు ఎత్తులు వేస్తున్నారు. నిజానికి కోర్టు కేసులు కారణంగా పదేళ్లు కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. కర్నూలు మున్సిపాలిటీని 1994లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. 1995లో తొలి ఎన్నికలు   నిర్వహించగా ఎస్సీ జనరల్ కోటా కింద బంగి అనంతయ్య ఎన్నికయ్యారు. 1995-2000 మధ్యకాలంలో టీడీపీ నుంచి బంగి ఆనంతయ్య మేయర్ గా వున్నారు. రెండోసారి జరిగిన ఎన్నికలో మేయర్ పదవిని జనరల్ కు కేటాయించారు. ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ బేగం మేయర్ గా ఎన్నికయ్యారు. 2000-2005 మధ్య కాలంలో ఆమె  పాలన సాగింది.

మూడవ సారి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి  రఘు రామి రెడ్డి మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే కర్నూలు కార్పోరేషన్ కు  2010 తరువాత ఎన్నికలు జరుగలేదు. అయితే గతేడాది    ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు పోటా పోటీగా   నామినేషన్లు వేశారు. అయితే కరోనా కారణంగా అది కాస్త అర్దాంతరంగా ఆగి పోయింది. ఈ క్రమం లోనే సరిగ్గా ఏడాదికి కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలకు మోక్షం వచ్చింది. నగరపాలిక మేయర్ స్థానాన్ని తొలిసారిగా బీసీలకు కేటాయించారు. ఈ మేయర్ గిరీ కోసం వైసీపీ, టీడీపి పార్టీల్లో  పోటీ పడుతున్నారు.

బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన కూడా కొన్ని డివిజన్లు అయినా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కార్పోరేషన్ పరిధిలో మొత్తం 52 డివిజన్లు ఉండగా..  614 మంది గతేడాది నామినేషన్లు వేశారు. అందులో ఒకరు మృతి చెందారు. నామినేషన్లు వేసిన వారిలో యువత, మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.  ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యూహాలు పన్నుతున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థిగా బీవై రామయ్య ను ఖరారు చేశారు. టీడీపీ మేయర్ అభ్యర్థి పోలింగ్ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించే అవకాశం ఉంది.   ఉపసంహరణల ప్రక్రియ ముగిశాక కార్పోరేషన్ ఎన్నిక వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.