సీట్లు పంచేది రాహుల్.. నోట్లు పంచేది చంద్రబాబు..

సీట్లు పంచేది రాహుల్.. నోట్లు పంచేది చంద్రబాబు..

కూటమిలో సీట్లు పంచేది రాహుల్ గాంధీ అయితే.. నోట్లు పంచేది చంద్రబాబు.. కానీ ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే ప్రజలందరూ ఆలోచించి ఓటేయ్యాలని పిలుపు నిచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోనే దమ్ము లేకనే కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమిగా ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.

 తెలంగాణను వంచించేందుకు చంద్రబాబు, రాహుల్ గాంధీ దోస్తీ కట్టారు. సోనియాను గాడ్సేతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖంతో కాంగ్రెస్ ముందు మోకరిల్లాడు. దశాబ్దాల నుంచి టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ డిమాండ్ ఉంది. కేంద్రం స్పందించినా.. స్పందించకపోయినా.. ఉక్కు పరిశ్రమను నెలకొల్పి తీరుతామని స్పష్టం చేశారు. పొరపాటున కూటమికి ఓటేస్తే నిర్ణయాలన్నీ అమరావతిలోనే ఉంటాయి. రైతన్నలు ఆలోచించి ఓటేయ్యాలి. కూటమికి ఓటేస్తే.. రైతులకు ఇబ్బందులు పడుతారు. ప్రాజెక్టులను అడ్డుకొని వ్యవసాయానికి నీరు రాకుండా చేస్తారు. మాయకూటమి అధికారంలోకి వస్తే ఒక్క ప్రాజెక్టును కూడా చంద్రబాబు కట్టనివ్వడు. అని కేటీఆర్ ప్రసంగించారు.