ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఒక్కసారిగా వేడి
ఖమ్మం జిల్లా అధికార పార్టీలో ఒక్కసారిగా వేడి పుట్టింది. చర్చలు ఫలప్రదం అవుతాయా అని అంతా ఆరా తీస్తున్నారు. తాజాలను మాజీలను మీటింగ్‌కు ఆహ్వానించడంతో అజెండాలో చేరే కొత్త అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల వేళ దిద్దుబాటు చర్యలు?
ఎన్నడు లేని విధంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరికి ఒకరికి పడదు. గెలిచిన వారికే తప్ప.. మాజీలకు ప్రాధాన్యం లేదన్నట్టుగా ఇక్కడి రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తలెత్తే సమస్యలు పార్టీ పెద్దల దగ్గర పంచాయితీలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వాడీవేడీగా ఉన్నాయి. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీ నేతలు ఎవరికి వారుగా ఉంటే ప్రతికూలంగా ఉంటుందని భావించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది అధికార పార్టీ.
తాజా భేటీ ఎన్నికలకే పరిమితమా?
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఆహ్వానించడంతో ఈ సమావేశంపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేవలం ఎన్నికలకే పరిమితం అవుతారా? లేక జిల్లా పార్టీలో నెలకొన్న సమస్యలకు కూడా సమాధానం దొరుకుతుందా అన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో తొలిసారిగా టీఆర్ఎస్ జెండా ఎగరేసిన జలగం వెంకట్రావు కూడా ఆహ్వానం వెళ్లింది. మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లును కూడా పిలిచారు. వీరిలో కొందరు ఎన్నికల్లో ఓడిపోగా.. మరికొందరు పోటీనే చేయలేదు. వీళ్ల అవసరం లేదని అనుకున్నారో.. లేక గెలిచిన నాయకులకు వీరి పొడ గిట్టలేదో కానీ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించేవారు కాదు నాయకులు. అలాంటిది ఇప్పుడు వారికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
సత్తుపల్లి గొడవ ప్రస్తావనకు వస్తుందా?
మొన్నటికి మొన్న సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన సంఘటనలపై పొంగులేటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ఎంపీ వర్సెస్ సండ్ర అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇద్దరు ఈ అంశంపై కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మరి.. ఆ పంచాయితీ కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తుందా రాదా అన్న ఆసక్తి నెలకొంది. అలాగే ఇన్నాళ్లు పట్టించుకోని పార్టీ.. ఎన్నికలు వచ్చే సరికి గుర్తొచ్చామా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నవారు కూడా ఉన్నారట. అందుకే ఈ సమావేశానికి ఎంత మంది వస్తారు.. వచ్చిన వారు ఏం చెబుతారు అన్నది కీలకంగా మారింది. మరి..ఈ సమావేశం తర్వాత జిల్లా టీఆర్ఎస్లో ఎలాంటి మార్పులు వస్తాయో.. నేతలు ఐక్యతారాగం ఆలపిస్తారో లేదో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)