భవిష్యత్ తరాల కోసం మంచి వాతావరణం అందించాలి : కేటీఆర్

 భవిష్యత్ తరాల కోసం మంచి వాతావరణం అందించాలి : కేటీఆర్


హైదరాబాద్​లో ఎలక్ట్రిక్‌ వాహనాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ రంగంలో కొత్తగా రూపొందించిన పాలసీని విడుదల చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం  విజయవంతం కాబోతోందని కేటీఆర్ అన్నారు. ఈ సదస్సులో ఎలక్ట్రిక్ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై చర్చ జరిగింది. భవిష్యత్ తరాల కోసం మంచి వాతావరణం అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.  వాతావరణంలో మార్పులతోనే ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడినట్లు పేర్కొన్నారు. ఫలితంగా హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందని ఉద్ఝాటించారు. హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీరంగంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయని తెలిపారు.  ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ఫ్రెండ్లీ వెహికల్స్​గా కేటీఆర్ పేర్కొన్నారు. మన వద్ద పెద్దఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉందని కేటీఆర్ అన్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయని వివరించారు. ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భూములు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వెయ్యి ఎకరాల్లో ఆటోమొబైల్ తయారీ యూనిట్‌ను ప్రోత్సహిస్తామని కేటీఆర్ తెలిపారు.