చిత్ర'మైన గాత్రం... ఆమె సొంతం!

చిత్ర'మైన గాత్రం... ఆమె సొంతం!

కాశ్మీరం మొదలు కన్యాకుమారి వరకు వసంత కోకిల స్వనాలను తపించే గాత్రంతో అలరించిన గాయని చిత్ర. 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో పుట్టిన చిత్ర... బాల్యంలోనే సంగీతనిధి త్యాగరాజస్వామి కీర్తనలతో పరిచయం పెంచుకుంది... త్యాగరాజస్వామి ఆరాధనలో సప్తస్వరసాధన చేస్తూ... తన కోకిల గాత్రానికి మరింత వన్నె సంపాదించింది... మాతృభాష మలయాళంలో గాయనిగా గుర్తింపు సంపాదించిన చిత్ర... తరువాత ఇళయరాజా సంగీతంలో యావత్ దక్షిణాదినీ అలరించింది... 1986లో 'సింధుభైరవి' తమిళ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా  విజయం సాధించింది...

ఆ తరువాత వరుసగా మళయాళ చిత్రం 'నఖశతంగల్', హిందీ చిత్రం 'విరాసత్' ద్వారానూ గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని 'హ్యాట్రిక్' సాధించింది... ఇప్పటి వరకు ఆరు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులను చిత్ర అందుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో ఆమె ఇరవై వేలకు పైగా పాటలు పాడారు. చిత్ర ఏ గానం విన్నా మది పులకించిపోతూ ఉంటుంది.

తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే ప్రొఫెసర్ ఒమన్ కుట్టి ప్రోత్సాహంతో చిత్ర 'అట్టహాసం' చిత్రంలో నేపథ్య గానం ఆలపించారు. ఆ తర్వాత ఏసుదాసు ట్రూప్ చేరి ఎన్నో కచేరీలలో పాల్గొన్నారు. 1982 నుండి నేపథ్య గాయనిగా చక్కని గుర్తింపు పొందిన చిత్ర ఆ తర్వాత రెండేళ్ళకే తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 'ప్రళయం' చిత్రంలో ఇళయరాజాతో కలిసి హమ్మింగ్ చేసిన చిత్ర... 'సింధుభైరవి', 'విజృంభణ' చిత్రాలలో పూర్తి స్థాయి పాటలు పాడారు. 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రం కోసం చిత్ర పాడిన 'పూసింది పూసింది పున్నాగ' గీతం సూపర్ హిట్ కావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 'కొండవీటి దొంగ' చిత్రం కోసం చిత్ర ఆలపించిన 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో' పాట ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. 1990 నుండి వరుసగా నాలుగేళ్ళ పాటు ఉత్తమ గాయనిగా నంది అవార్డులను అందుకున్నారు. 'మాతృదేవోభవ, సుందరకాండ, భైరవద్వీపం, శుభసంకల్పం, బొంబాయి ప్రియుడు చిత్రాలు ఆమెకు నంది పురస్కారాలను అందచేశాయి. 'జగదేకవీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, రాజా' వంటి చిత్రాలలో చిత్ర పాటలను అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక రెండువేల సంవత్సరం తర్వాత కూడా 'స్వయంవరం, వర్షం, కలవరమాయే మదిలో' చిత్రాలకు గానూ చిత్ర ఉత్తమ గాయనిగా నంది పురస్కారం అందుకున్నారు. 1985 నుండి 14 సంవత్సరాల పాటు కేరళ ప్రభుత్వం నుండి ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్న ఘనత చిత్ర సొంతం. 2005లో పద్మశ్రీ పురస్కారంతో చిత్రను గౌరవించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో ఆమె అభిమానులంతా ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు.