బుల్లితెరకే ఓటేస్తున్న కోలీవుడ్

బుల్లితెరకే ఓటేస్తున్న కోలీవుడ్

కరోనా కలకలం క్రమంగా తగ్గుతోంది. ఇంకా కేసులు పుట్టుకొస్తూనే ఉన్నా థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రేక్షకులు కూడా బాక్సాఫీస్ వద్దకు వచ్చేస్తున్నారు. అయితే, కొందరు తమిళ హీరోలు మాత్రం పెద్ద తెర కంటే బుల్లితెర బెటర్ అనుకుంటున్నారు. బిగ్ రిలీజ్ కి ఛాన్స్ ఉన్నా ఓటీటీకే ఓటేస్తున్నారు!

తమిళ హీరో ‘జయం’ రవి నటించిన ‘భూమి’ ఈ మధ్యే ఓటీటీలో విడుదలైంది. అంతే కాదు, కొన్నాళ్ల కింద లేడీ సూపర్ స్టార్ నయనతార ‘మూకుతి అమ్మన్’ సినిమా కూడా డిజిటల్ గానే స్ట్రీమింగ్ అయింది. ఈ రెండూ కోలీవుడ్ లో పెద్ద సినిమాలే. అయినా లాక్ డౌన్ తరువాతి నేపథ్యంలో, చిన్న తెరనే ఎంచుకున్నాయి. ఇక ఇప్పుడు మరికొన్ని క్రేజీ సినిమాలు ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి వచ్చేస్తున్నాయి. ఓటీటీ హీరోల లిస్టులో తాజాగా చేరాడు ఆర్య. ఆయన భార్య సయ్యేషాతో కలసి చేసిన సినిమా ‘టెడ్డీ’. ఇది కూడా ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ పై స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. మార్చ్ 12న విడుదల అంటూ అఫీషియల్ గా ప్రకటించారు...

కోలీవుడ్ లో కేవలం ఆర్యనే కాదు... సముద్రఖని మొదలు ధనుష్ దాకా... చాలా మంది హీరోలు ఓటీటీ రిలీజ్ కు ఓటేస్తున్నారు. థియేటర్లు పూర్తిగా తెరుచుకున్నా కూడా డీల్స్ సెట్ కావటం లేదు. సముద్రఖని నటించిన ‘ఏలే’ సినిమా మొదట పెద్ద తెరపై విడుదలవుతుందని అన్నారు. కానీ, థియేటర్ల యజమానులు 30 రోజుల దాకా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయవద్దని షరతు పెట్టారు. నిర్మాత అందుకు ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు సముద్రఖని ‘ఏలే’ చిత్రం విజయ్ టీవీలో లైవ్ గా ప్రదర్శించబోతున్నారు. అదే సమయంలో ఆన్ లైన్ లో కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ ప్రయోగం బాగానే గిట్టుబాటు అయితే ముందు ముందు ఇంకా చాలా సినిమాలే నేరుగా టీవీ తెరపైకి వచ్చేయవచ్చు. అటు స్టార్ హీరో ధనుష్ కూడా ‘జగమే తందిరమ్‘ సినిమాతో ఓటీటీ బాట పడుతున్నాడు. కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుందట! చూడాలి మరి, ప్రేక్షకుల్ని తమ వద్దకి రప్పించుకోకుండా తామే ఆడియన్స్ వద్దకొస్తోన్న... కోలీవుడ్ న్యూ మూవీస్... ఎంత వరకూ సెన్సేషన్ సృష్టిస్తాయో!