కొడాలి నాని కంట్రోల్ తప్పారా...?
ఆ మంత్రి నోరు తెరిస్తే...మాటల తూటాలు పేలాల్సిందే. ఆ తూటా ఎటు పేలుతుందో కూడా పట్టించుకోరు. అందుకే పంచాయతీ ఎన్నికలయ్యేవరకు కంట్రోల్..కంట్రోల్.. అని అనుకున్నారట. కానీ.. అనుకోకుండా మీడియా ముందుకు వచ్చి దొరికిపోయారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ?
నోటికి పనిచెప్పి మళ్లీ ఇరకాటంలో పడ్డారా?
కొడాలి నాని. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి. కేబినెట్లో ఓ ఫైర్‌బ్రాండ్ మినిస్టర్. అంశమేదైనా ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడి.. చర్చల్లోకి వస్తారు. ఆయన ప్రస్తావించిన అంశాలు.. ఉపయోగించే పదాలు రచ్చ రచ్చ అవుతాయి. ఆయన మాత్రం కూల్‌గానే ఉంటారు. కొడాలి నాని మీడియా ముందుకు వస్తే చాలు.. ఏం మాట్లాడతారు? ఎవరిపై ఏ విధంగా విరుచుకుపడతారో తెలియదు. ఈ వైఖరి వల్ల ఆయన ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి నోటికి పనిచెప్పి ఇరకాటంలో పడ్డారు. ఏకంగా ఆయనపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని SEC ఆదేశించే వరకు వివాదం వెళ్లింది. ఈ సందర్భంగా మంత్రికి సంబంధించిన ఒక అంశం వెలుగులోకి వచ్చింది. అది తెలిసి పార్టీ వర్గాలు సైతం ఆసక్తిగా చర్చించుకుంటున్నాయట.
మంత్రి వివరణపై సంతృప్తి చెందని ఎస్ఈసీ!
తాజాగా మీడియా ముందుకు వచ్చిన కొడాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ప్రయోగించిన పదాలు ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావించిన SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఆ ప్రెస్‌మీట్ అయిన అరగంటలోనే షోకాజ్ నోటీసు జారీ చేశారు. సాయంత్రం ఐదుగంటలలోపు వివరణ ఇవ్వాలని గడువు పెట్టడంతో న్యాయ నిపుణులను సంప్రదించి రిప్లయ్ ఇచ్చారు మంత్రి. అయితే ఆ ఎపిసోడ్ అక్కడితో ఆగలేదు. మంత్రి ఇచ్చిన వివరణపై SEC సంతృప్తి చెందలేదు. కొడాలి నాని పశ్చాత్తాపం పడిన దాఖలాలు లేవని చెబుతూ కొన్ని ఆంక్షలు పెట్టింది. మీడియా ముందుకు రావొద్దని, సమావేశాల్లో మాట్లాడొద్దని కొడాలిని కట్టడి చేసింది. SEC ఇచ్చిన ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు మంత్రి.
మంత్రిపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశం!
ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే వివాదం మరో మలుపు తీసుకుంది. SEC నిమ్మగడ్డ మరో ఆర్డర్ పాస్ చేశారు. తనను బెదిరించిన మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలిచ్చారు నిమ్మగడ్డ. అంతేకాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా కొడాలి నాని సైతం అస్త్రాలు బయటకు తీస్తున్నారు.
కంట్రోల్.. కంట్రోల్ అని అనుకుని కంట్రోల్ తప్పారా?
ఈ వరస పరిణామాలు జరగడానికి కారణం కొడాలి నాని మీడియా సమావేశం నిర్వహించటమేనని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన మంత్రి.. పంచాయతీ ఎన్నికలు అయ్యేవరకు మీడియాకు దూరంగా ఉండాలని అనుకున్నారట. ఆ మేరకు కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులో ఉండకుండా.. తెరవెనక ఎన్నికల పనులు చేసుకుంటున్నారట. అయితే పౌరసరఫరాల శాఖలో డోర్ డెలివరీ వ్యవస్థపై మీడియాలో వ్యతిరేక కథనాలు రావడంతో... వాటిని ఖండించడానికి ఆ శాఖ మంత్రిగా మీడియా ముందుకు వచ్చారు. ఎంత కంట్రోల్.. కంట్రోల్ అని అనుకున్నా.. కంట్రోల్ తప్పేశారు. దాంతో ముందు అనుకున్న నిర్ణయానికే కట్టుబడి మీడియా ముందుకు రాకుండా ఉండి ఉంటే బాగుండేదని ఫీలవుతున్నారట మంత్రివర్యులు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)