కేకేఆర్ బౌలర్ నరైన్ కు బీసీసీఐ నుండి ఊరట...

కేకేఆర్ బౌలర్ నరైన్ కు బీసీసీఐ నుండి ఊరట...

ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ను హెచ్చరిక జాబితా నుండి తొలగించినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అక్టోబర్ 10న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నరైన్ స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దాంతో బీసీసీఐ నరైన్‌ ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నట్లు తెలిపింది. అయితే తాజాగా బీసీసీఐ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ ఆ మ్యాచ్ లోని నరైన్ బౌలింగ్ యొక్క స్లో మోషన్ యాక్షన్ ఫుటేజ్ ను పరిశీలించింది. అందులో నరైన్ మోచేయి-బెండ్ సరైన పరిమితుల పరిధిలో ఉన్నట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. దాంతో అతను మళ్ళీ బౌలింగ్ చేయవచ్చు అని వారు తెలిపారు. అయితే ఈ ఫిర్యాదు కారణంగా నరైన్ ఈ రోజు కోల్‌కత ఆడుతున్న మ్యాచ్ తో కలిపి మొత్తం 3 మ్యాచ్ లు జట్టుకు దూరంగా ఉన్నాడు.