కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్ పంజాబ్ ఘన విజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్ పంజాబ్ ఘన విజయం

ప్లే ఆఫ్స్‌ కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన దశకు వచ్చాక కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజృంభిస్తోంది. సగం టోర్నీ ముగిసే సరికి ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన పంజాబ్‌ ఆ తర్వాత వరుసగా ఐదో విజయంతో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. బౌలింగ్‌ తో కోల్‌ కతాను కట్టడి చేసిన పంజాబ్‌ ఆ తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌, మన్‌దీప్‌ సింగ్‌ సూపర్‌ పార్ట్‌నర్‌షిప్‌తో సూనాయాసంగా విజయం సాధించింది. నైట్‌రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 150 పరుగుల లక్ష్యఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇరగదీసింది. 

గాయం కారణంగా మయాంక్‌ దూరమైనా.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌.. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌కు చక్కటి సహకారం అందించాడు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాక రాహుల్‌ ఔటైనా.. గేల్‌ రాకతో కోల్‌కతా కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వరుణ్‌ చక్రవర్తి ఓవర్‌లో 2 సిక్సర్లతో దంచుడు మొదలెట్టిన గేల్‌.. నరైన్‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్సర్లు బాదాడు. మరో ఎండ్‌లో మన్‌దీప్‌ నిలకడగా ఆడటంతో చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే నితీశ్‌ రాణా గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ బాట పడితే.. షమీ వేసిన రెండో ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌ ఔటయ్యారు. దీంతో 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో గిల్‌తో జతకలిసిన కెప్టెన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆరంభంలోనే వికెట్లు పడ్డా ఏ మాత్రం బెదరకుండా వరుస బౌండ్రీలతో రెచ్చిపోయాడు. షమీ వేసిన ఆరో ఓవర్‌లో మోర్గాన్‌ రెండు ఫోర్లు కొడితే.. గిల్‌ రెండు సిక్సర్లు అరుసుకున్నాడు. ఈ జోడీ ఇదే జోరు కనబర్చడంతో రన్‌రేట్‌ దూసుకెళ్లింది. మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించాక మోర్గాన్‌ ఔట్‌కాగా.. అక్కడి నుంచి స్కోరు వేగం తగ్గింది.