ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతున్న వరుస కిడ్నాప్‌ కేసులు

ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతున్న వరుస కిడ్నాప్‌ కేసులు

ప్రకాశం జిల్లాలో వరుస కిడ్నాప్‌ కేసులు కలకలం రేపుతున్నాయ్. పిల్లలను బయటకు పంపాలంటే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. కిడ్నాప్‌ల వెనుక ఏమైనా గ్యాంగులున్నాయా..? చేధించేందుకు పోలీసులు పన్నుతున్న వ్యూహాలేంటి..?  ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్న పిల్లల్ని అపహరించే  ముఠాలు జిల్లాలో సంచరిస్తున్నాయని భయాలు పెరిగిపోతున్నాయ్. గత 16 నెలల క్రితం ముండ్లమూరు మండలం రెడ్డినగర్ కి చెందిన ఆరుష్ రెడ్డి అనే రెండేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. 

గత ఏడాది జూన్ 24న ఇంటిముందు ఆడుకుంటున్న ఆరుష్ రెడ్డిని పొలానికి వెళ్తూ తండ్రి చూశాడు. అరగంటలో ఇంటికి వచ్చే సరికి ఆరుష్ రెడ్డి కనిపించలేదు. పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. కిడ్నాప్ కేసు వచ్చిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా నుంచి వెళుతున్న అన్ని వాహనాలను తనిఖీలు చేశారు. అయినా ఆరుష్ రెడ్డి జాడ చిక్కలేదు. ఏడాదిన్నరగా పిల్లాడు ఏమయ్యాడో తెలియడం లేదు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ముండ్లమూరు పోలీసుల నుంచి డీజీపీ ఆఫీసు వరకూ ఎక్కని గడపలేదు. కానీ ఫలితం లేకుండా పోయింది. 

ఆరుష్ రెడ్డి కిడ్నాప్ కేసు కొనసాగుతుండగానే.. గత నెల 30న దర్శిలో ఓ పాప కిడ్నాప్‌ అయ్యింది. తల్లిని మోసం చేసిన ఓ మహిళ నెల రోజుల పాపతో ఉడాయించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే మహిళను పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న పాపను తీసుకుని క్షేమంగా తల్లికి అప్పగించారు. తాజాగా నాలుగేళ్ల కొడుకు కనిపించకుండా పోయాడని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన చీరాలలో జరిగింది. ఇస్లాంపేటకు చెందిన యాకూబ్ సాహెబ్ నాలుగేళ్ల కుమారుడు యూసఫ్ గత నెల 13న ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండాపోయాడు. 

నెలరోజులు దాటినా ఆచూకీ తెలియకపోవడంతో.. తండ్రి  యాకూబ్ సాహెబ్ మనస్తాపంతో కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, జిల్లాలో కనిపించకుండా పోతున్న చిన్నారుల ఆచూకీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నామంటున్నారు పోలీసులు. చిన్నారుల ఆచూకీ కోసం అన్ని రాష్ట్రాల్లో ఉన్న పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నట్టు ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ తెలిపారు. మొత్తమ్మీద.. వరుస కిడ్నాప్‌లతో ప్రకాశం జిల్లాలో పిల్లల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. చిన్నారులను బయటకు పంపాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా చిన్నారులను అపహరిస్తున్న గ్యాంగ్‌లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.