ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త పరిణామాలు!

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త పరిణామాలు!

ఒకరేమో పెద్దమనిషి. అందరినీ కలుపుకొని పోవాలని చూస్తారు. ఇంకొకరు గిల్లికజ్జాలు పెట్టుకుంటారు. దీంతో ఆ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య దూరం పెరిగింది. ఇప్పుడా గ్యాప్‌ను పూడ్చుతూ పార్టీ పెద్దలు మంత్రం వేశారు. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. 

తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రి అజయ్‌!

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. జిల్లాలో పెద్దమనిషిగా ఉన్న  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రులు క్యూ కట్టారు. ఇలా తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రుల్లో పువ్వాడ అజయ్‌ కూడా ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. 

పువ్వాడ ఒంటెత్తు పోకడలపై పార్టీలోనే విమర్శలు!

ఖమ్మం అంటే తుమ్మల నాగేశ్వరరావు అనేట్టు గతంలో రాజకీయాలు నడిచాయి. కనుసైగతో ఆయన రాజకీయాలను శాసించేవారు. అలాంటిది 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడంతో రాజకీయ ప్రయాణానికి గ్రహణం పట్టినట్టు అయింది. అయినా పెద్ద మనిషి హోదాలో ఆయన అందిరినీ కలుపుకొని పోవడానికే చూశారు. ఇదే సమయంలో మంత్రివర్గంలో చేరిన పువ్వాడ అజయ్‌ తీరు జిల్లాలో వివాదాలకు కేంద్రమైంది. పువ్వాడ అంటే ఎవరికీ పడదు అనే ముద్ర పడిపోయింది. మంత్రిగా అజయ్‌  ఒంటెత్తు పోకడలు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటారని టీఆర్‌ఎస్‌లోనే చెప్పుకొంటారు. 

మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్‌ అక్షింతలు వేశారా? 

అజయ్‌ మంత్రి అయిన తర్వాత ఇటు తమ్మల నాగేశ్వరరావును, అటు ఎంపీ నామా నాగేశ్వరరావు ఇద్దరినీ దూరం పెట్టడంతో జిల్లాలో పార్టీ తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారిపోయింది. అయితే ఖమ్మం జిల్లాలో  జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు చెక్‌ పెట్టింది. రాజకీయంగా  జిల్లాలో బలమైన శక్తిగా ఉండే తుమ్మల కామ్‌గా ఉంటే పార్టీకి నష్టమని భావించి.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సమాచారం. గొడవలకు కారణమైన మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్‌ అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పరిణామాలు ఒకదాని వెనక మరొకటిగా వేగంగా మారిపోయాయి. 

తుమ్మల ఇంటికి వెళ్లిన ఇద్దరు మంత్రులు!

రాత్రి సీఎంతో సమావేశ ముగిసిన వెంటనే పువ్వాడ స్వయంగా తుమ్మలకు ఫోన్‌ చేసి రైతు వేదిక ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. అంతేకాదు.. తెల్లారిన తర్వాత వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అజయ్‌లు హెలికాఫ్ట్‌ర్‌లో తుమ్మల ఇంటికి వెళ్లి.. ఆయన్ని స్వయంగా వెంట బెట్టుకుని కార్యక్రమానికి తీసుకెళ్లడం జిల్లాలో చర్చకు దారితీస్తోంది. ఇద్దరు మంత్రులు వస్తున్నారని తెలుసుకున్న అనుచరులు అప్పటికే  తుమ్మల ఇంటికి పెద్దసంఖ్యలో వచ్చారు. జిల్లాలో తమ్మల బలం తగ్గలేదని చెప్పడానికి కూడా అనుచరుల రాక వేదికైందని అనుకుంటున్నారు. 

తుమ్మల ఇంటికి వెళ్లిన ఎంపీ నామా!

ఇటీవల ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం తుమ్మల ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరు నాయకులు కలిసి పెళ్లిళ్లకు హాజరు కావడం కేడర్‌లోనూ కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ఇప్పుడు మంత్రులు రావడంతో మళ్లీ తుమ్మల నాగేశ్వరరావు చక్రం తిప్పే సమయం వచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో కామ్‌గా ఉండిపోయారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన్ని కూడా రైతు వేదిక కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి పువ్వాడ ఫోన్‌ చేసినా శ్రీనివాస్‌రెడ్డి రాలేదు.  కాకపోతే.. రాజకీయాల్లో పెద్దమనిషిగా గుర్తింపు పొందిన తుమ్మల నాగేశ్వరరావు విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం చర్చకు దారితీసింది.