ఎమ్మెల్సీ తరువాత కవిత ఫోకస్ ఏ పదవిపై పడింది

ఎమ్మెల్సీ తరువాత కవిత ఫోకస్ ఏ పదవిపై పడింది

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక లాంఛనమే. ఏడాదిన్నర గ్యాప్‌ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తోన్న ఆమె.. ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? కవితకు ఎమ్మెల్సీతో సరిపెడతారా? అంతకుమించిన పదోన్నతి ఉంటుందా? టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 

కవిత కేబినెట్‌లో చేరతారని ప్రచారం!

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు బలం ఉండటంతో కవిత ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే. కాకపోతే పోలింగ్‌ సమయంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.  కవిత కేబినెట్‌లో చేరతారని కొందరు లెక్కలు వేసుకుంటుంటే.. కేబినెట్‌ హోదాతో సమానమైన పదవి వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

కవిత కాబోయే మంత్రి అంటూ ఎమ్మెల్యేల కామెంట్స్‌!

తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక KTRను కేబినెటలోకి తీసుకోలేదు. దాంతో పార్టీ నేతలంతా మంత్రివర్గంలో KTR ఉండాలని పెద్ద ఎత్తున గళం వినిపించారు. ఇంకొందరైతే.. కేటీఆర్‌ మంత్రిగా లేకపోవడం వల్ల.. పట్టణాల అభివృద్ధి వేగంగా లేదని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్‌ విస్తరణలో ఆయనకు చోటు కల్పించారు. ఇప్పుడు కవిత విషయంలోనూ పార్టీ నేతలు అదే విధమైన స్వరం వినిపిస్తున్నారట. కాబోయే మంత్రి అంటూ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ చేసిన కామెంట్స్‌ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మరో ఎమ్మెల్యే గణేష్‌ గుప్త అయితే కవిత మరింత ఉన్నతమైన పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

ప్రస్తుతం కేబినెట్‌లో ఖాళీలు లేవు!

అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి సహ కేబినేట్ సభ్యుల సంఖ్య 18కి మించకూడదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీలు లేవు. ఒకవేళ కవితను కేబినేట్‌లోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరో ఒకరు రాజీనామా చేయడం లేదా తప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి పరిణామాల తర్వాత కవితను కేబినేట్‌లోకి తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. 

శాసనమండలిలో విప్‌గా నియమిస్తారా? 

ఒకవేళ కవితను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకోలేని పరిస్థితిలో కేబినేట్ హోదాతో సమానమైన ఏదైన పదవిని కట్టబెట్టే అవకాశంపై చర్చ జరుగుతోందట. కవితను శాసనమండలిలో విప్‌గా నియమించడానికి ఆప్షన్ ఉంది. లేదంటే ఏదైన కీలకమైన కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేస్తారని.. కేబినెట్‌ ర్యాంక్‌ కల్పిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట. అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో క్రియశీలక పాత్ర పోషిస్తారా లేక ఇందూరు జిల్లా రాజకీయాలకే పరిమితం అవుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఎమ్మెల్సీ పదవీ కాలం 14 నెలలు!

ఎమ్మెల్సీగా కవిత ఆ పదవిలో 14 నెలలపాటే ఉంటారు. అందుకే ఆ 14 నెలల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పాత్ర ఏంటన్నది పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి.. ఏం జరుగుతుందో.. గులాబీ దళపతి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.