ఏపీ అసెంబ్లీ సమావేశాలు: కీలక బిల్లులు ఆమోదం 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: కీలక బిల్లులు ఆమోదం 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.  నాలుగో రోజున కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం.  దిశా బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  అయితే, ఈ బిల్లుపై చర్చించాలని,మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది.  కానీ అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ వాకౌట్ చేసింది.  దిశా బిల్లు తరువాత ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటలింగ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లును కూడా సభ ఆమోదించింది.  ఈ బిల్లుపై సభలో చర్చను నిర్వహించారు.  భూములను పూర్తి స్థాయిలో రీ సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన తెలిపారు.  దీనికోసం ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు అయన పేర్కొన్నారు.  అయితే, భూముల రీ సర్వే ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇలాంటి రీ సర్వే ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారని అన్నారు. 

ఆస్తిపన్నును పెంచుతూ రూపొందించిన మున్సిపల్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  దీనిపై కొంతసేపు సభలో రగడ జరిగింది.  ఆస్తిపన్ను ఎంత శాతం పెంచుతున్నారనే అంశాన్ని బిల్లులో ప్రస్తావించలేదని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.  పేదలపై భారం పడకుండా ఆస్తిపన్ను పెంచుతామని మంత్రి బొత్సా పేర్కొన్నారు.  15శాతానికి మించకుండా చూస్తామని బొత్స పేర్కొన్నారు.