యాదాద్రి పర్యటనలో కేసీఆర్ కీలక ఆదేశాలు !

యాదాద్రి పర్యటనలో కేసీఆర్ కీలక ఆదేశాలు !

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణం తో పాటు ఆలయం చుట్టుపక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పున నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చిన నేపథ్యంలో.. ఇంకా అసంపూర్తిగా ఉన్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం యాదాద్రిలో పర్యటించారు.  హైదరాబాద్ నుంచి యాదాద్రి కి చేరుకున్న సీఎం, తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. అవి ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు.

ఆలయ ప్రాంగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్, మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శనం సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు,శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నాన గుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణం పరిశీలించారు. మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. 

ఆలయ చుట్టూ ప్రహరీ కి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళా ఉట్టిపడేలా అలంకృత రూపం(ఆర్నమెంటల్ లుక్కుతో వుండేలా, బ్రాస్ మెటల్ తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తి భావన ఉట్టి పడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. దేవాలయ  ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని,. ప్రాచీనత, నవ్యతతో పాటు దైవ సందర్శకులకు,భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని కోరారు. తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో, దేశం లోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు.

ప్రహ్లాద చరిత్ర సహా...నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణం లో అలంకరించాలన్నారు.   ప్రహరీని ఆనుకుని ఉండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో  విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలని కోరారు. మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో  పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. 

గర్భగుడి ముందు ధ్వజస్తంభాన్ని హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూరు పెయింటింగులను పరిశీలించారు. నృసింహ స్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తాపడం చేసిన పలు దేవతా మూర్తులను పరిశీలించారు.  ఆండాళ్ ఆల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని, దాన్ని కొనసాగించాలని సూచించారు.

అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్న పుడు హడావిడి పడకూడదన్నారు. తిరుపతిలో లాగా, స్వామి వారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు చెప్పారు. 

నిర్మాణం పూర్తికావచ్చిన ఈవో కార్యాలయాన్ని, స్వామి వారి పల్లకీ గద్దెను, అద్దాల మండపాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి,  రెయిలింగ్ పనులను చూసి మెచ్చుకున్నారు. అద్దాల మండపానికి అద్భుతంగా ప్రత్యేకత చాటుకునే లా ఉండేల తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే చైనా సందర్శించి, అక్కడ 7 కి.మీ. దూరం లైట్లతో నిర్మించిన మాల్ ను, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని అధికారులను సీఎం కేసీఆర్ కోరారు. హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో, భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో అధికారులకు సూచనలిచ్చారు. బంగారు తాపడం చేసిన కళశాలు, విగ్రహాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 

యాదాద్రిలో గెస్ట్ హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా... రిటైరైన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తినీ వెల్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. శివాలయాన్ని దర్శించిన సీఎం కేసీఆర్.. రుత్విక్కులు కోసం మండపం బాగా కట్టారని కితాబిచ్చారు. 

క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు ఆహ్లాదంగా వుండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాటు ఉండాలన్నారు. మెట్ల దారి నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వాళ్ళు నేరుగా క్యూ లైన్ కాంప్లెక్స్ చేరేలా నిర్మాణం ఉండాలని అన్నారు. స్వామివారి పుష్కరిణిని పరిశీలించిన సీఎం కేసీఆర్, గుండంలో స్నానం చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన  ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. 

అనంతరం గుడి కింద ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏసీ ప్లాంట్ గ్యాస్ గోదాములను, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను, కాలినడక నిర్మాణ పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న రహదారి  వలయం, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాన్ని కలియ తిరుగుతూ  ముఖ్య మంత్రి స్వయంగా పరిశీలించారు. స్వామి పుష్కరిణి పనులు, మెట్ల దారి, భక్తుల సౌకర్యం కోసం పనులు, పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.

కొండ క్రింద.. రింగ్ రోడ్, బస్ టెర్మినల్, పుష్కరణి, కళ్యాణ కట్ట, అన్నదానం కాంప్లెక్స్లో  , ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణాలను స్వయంగా  సీఎం కేసీఆర్ పరిశీలించారు. యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ సహా.. ప్రభుత్వ విప్ సునీత, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సహా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.స్థాపతి వేలు, YTDA వైస్ చైర్మన్ కిషన్ రావు, E.O గీతారెడ్డి ఉన్నారు..