కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి

కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి

ఎందరో మహానుబావులు  వారిలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఒకరు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈ మహానుభావుడు. తన రచనలతో కావ్యాలతో సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు అయ్యారు. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం . రచనలు కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు ఇలా ఎన్నో ఆయన కలం నుంచి జాలువారాయి . నేడు విశ్వనాథ సత్యనారాయణ జయంతి. కవిసామ్రాట్ బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ. మహా కవి శ్రీ శ్రీ సైతం విశ్వనాథ సత్యనారాయణ రచనలకు మంత్రముగ్దులు అయ్యవారు. విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు.అద్భుత రచనలతో పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ 1895, సెప్టెంబరు 10న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరులో జన్మించారు.ఆయనది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. చిన్నతనం లో భోగభాగ్యాలను అనుభవించినా ఆతర్వాత దాన గుణం వల్ల కటిక పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది. 1916 లో "విశ్వేశ్వర శతకము"తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు. ఆతర్వాత 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు ఇలా ఎన్నో అజరామరంగా నిలిచిపోయే రచనలు చేసారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ . విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. ''రామాయణ కల్పవృక్షము'' అనే పుస్త‌క ర‌చ‌న‌కు గాను జ్ఞాన పీఠ్ అవార్డు అందుకున్నారు.కవిగా పండితునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడుగా, గాయకుడిగా రాణించిన విశ్వనాథ  1976 అక్టోబరు 18న పరమపదించారు.