దుబ్బాకలో పదును లేని కత్తి..!

దుబ్బాకలో పదును లేని కత్తి..!

దుబ్బాక ఉపఎన్నికలో సడెన్‌ ఎంట్రీ ఇచ్చి.. డిపాజిట్‌ కోల్పోయిన బిగ్‌బాస్‌ ఫేం కత్తి కార్తీక ఏం సాధించింది? బౌన్సర్ల రక్షణలో.. పోష్‌ కారుల్లో వచ్చి ప్రచారం చేసిన ఆమె.. ఫలితం రాగానే తట్టా..బుట్టా సర్దేసుకుని వెళ్లిపోయింది. ఇంతకీ కార్తీకకు వచ్చిన ఓట్లు ఎన్ని? 

కత్తి కార్తీకకు వచ్చిన ఓట్లు 636

దుబ్బాక ఉపఎన్నికలో ప్రధాన పార్టీల పోటీ  ఒక ఎత్తు అయితే.. బిగ్‌ బాస్‌ ఫేం కత్తి కార్తీక పోటీ మరో ఎత్తు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేసిందామె. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో తన మకాంను దుబ్బాకకు మార్చేసింది. ఎమ్మెల్యే అంటే ఇక్కడే ఉండాలి అని పెద్ద పెద్ద డైలాగులు ఆమె నుంచి వచ్చాయి. కాబోయే ఎమ్మెల్యే కార్తీకే అంటూ ఆమె అనుచరులు కోరస్‌ ఇచ్చారు. తీరా ఫలితాల తర్వాత చూస్తే కత్తి కార్తీకకు వచ్చిన ఓట్లు 636. ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 15. ఇక్కడ 21వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్‌కే డిపాజిట్‌ రాలేదు. మరి.. 636 ఓట్లు తెచ్చుకున్న కార్తీకకు డిపాజిట్‌ వస్తుందో రాదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆమె వెంట తిరిగిన వారి ఓట్లూ పడలేదా? 

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో అంతలేదు ఇంత లేదన్న కార్తీకకు వచ్చిన ఓట్లు చూసి జోకులు పేలుతున్నాయట. ప్రచారంలో ఆమె వెంట తిరిగిన వారి ఓట్లు కూడా పడలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రచారం జరిగినన్ని రోజులూ BMW,  స్కోడా, రేంజ్‌ రోవర్‌ కార్లలో తెగ సందడి చేసింది కార్తీక. ఎవరైనా మేడమ్‌ను కలవాలి అంటే ముందుగా అపాయింట్మెంట్‌  తీసుకోవాలి అనే స్థాయిలో చుట్టూ ఉన్నవారు ఆంక్షలు పెట్టేవారు. 

ఉప ఎన్నిక ఫలితం రాగానే దుబ్బాక నుంచి జంప్‌? 

దుబ్బాకలో కార్తీక పోటీ చేస్తున్న సమయంలోనే ఆమెపై ఓ ల్యాండ్‌ డీలింగ్‌ విషయంలో హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల్లో తనను ఎదుర్కోలేకే  కేసులతో కుట్రలు చేస్తున్నట్టు సెంటిమెంట్‌ సీన్లు కురిపించిందామె. దుబ్బాకలో సైలెంట్‌ ఓటింగ్‌ జరుగుతుందని.. గెలిచినా.. ఓడినా ఇక్కడే ఉంటానని సినిమా డైలాగులు ఓ రేంజ్‌లో ఆమె ప్రచార శిబిరం నుంచి వచ్చాయి. మరి.. ఆ మాటలు గుర్తున్నాయో లేదోకానీ.. ఉపఎన్నిక ఫలితం రాగానే దుబ్బాక నుంచి మూటా ముళ్లు సర్దుకుని వెళ్లిపోయింది కార్తీక. 

పొలిటికల్‌ పునాది కోసమే దుబ్బాకలో పోటీ?

ఉపఎన్నికలో గెలవలేకపోయినా.. ఈ పోరు లాంగ్‌టర్మ్‌లో తన రాజకీయ భవిష్యత్‌కు ఉపయోగపడుతుందనే లెక్కలు వేసుకుంటోందట కత్తి కార్తీక. దానికి దుబ్బాక ఓ ట్రైలర్‌ అని ఆమె చెబుతున్నట్టు సమాచారం. దుబ్బాకలో గెలవలేమని ముందే తెలిసినా.. పొలిటికల్ పునాది కోసమే బరిలో దిగారని అనుచరులు చెప్పుకొంటున్నారట. పైగా ఎన్నికలంటే ఎన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయా ఏంటి అని సర్ది చెబుతున్నారట ఈ బిగ్‌బాస్‌ ఫేం.