కరీంనగర్‌లో మేయర్‌ వర్సెస్‌ మాజీ మేయర్‌!

కరీంనగర్‌లో మేయర్‌ వర్సెస్‌ మాజీ మేయర్‌!

అభివృద్ధి చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం. కానీ.. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చాలా అరుదు. ఇలాంటి అరుదైన ఘటనకు కరీంనగర్‌ వేదికైంది. మేయర్‌ వర్సెస్‌ మాజీ మేయర్‌ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఎందుకిలా? పార్టీలో జరుగుతున్న చర్చేంటి? 

కార్పొరేషన్‌ వేదికగా బయటపడుతున్న వైరం!

కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారాయి.  స్వపక్షంలోనే విపక్షం తయారైందా అన్నట్లుగా పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ముఖ్యంగా మేయర్‌  సునీల్‌ రావు.. మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ మధ్య అస్సలు పొసగడం లేదు. వీరి వైరం కార్పొరేషన్‌ వేదికగానే బయటపడుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధుల్లా విమర్శలు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వడం లేదట. 

మరోసారి మేయం పీఠం ఆశించినా ఈక్వేషన్స్‌ మారిపోయాయా?

తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో.. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రవీందర్‌సింగ్‌కు  మేయర్‌గా పనిచేసే అవకాశం చిక్కింది. పార్టీ పెద్దల ఆశీసులు కూడా పుష్కలంగా ఉండటంతో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. మొన్న జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ మరోసారి మేయర్‌ పీఠం ఆశించారు రవీందర్‌సింగ్‌. కార్పొరేటర్‌గా గెలిచినా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌తో పడకపోవడంతో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. మేయర్‌గా సునీల్‌రావును ఎంపిక చేశారు. పైగా గంగులతో సునీల్‌రావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కి కూడా ఆయన సన్నిహితం. దీంతో రవీందర్‌సింగ్‌ ఆశ నెరవేరలేదు. 

మేయర్‌ సునీల్‌రావు అస్సలు ఊరుకోవడం లేదా? 

ఈ సమీకరణాలే కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ రాజకీయాలను వేడెక్కించాయి. మేయర్‌కు మాజీ మేయర్‌కు అస్సలు పడటం లేదు. ఈ విభేదాలు కార్పొరేషన్‌ తొలి సాధారణ సమావేశంలోనే బయటపడ్డాయి. మేయర్‌, మాజీ మేయర్‌ ఇద్దరూ నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు. నగర సమస్యలే కాదు.. ప్రొటోకాల్‌ అంశాలపైనా వైరి వర్గాల మాదిరి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మేయర్‌గా నీవేం  వెలగబెట్టావో అందరికీ తెలుసని సునీల్‌రావు అంటుంటే.. ఎవరేంటో అందరికీ తెలుసని రవీందర్‌సింగ్‌ కౌంటర్‌ ఇచ్చారట. వీరిద్దరి గొడవను ప్రతిపక్ష పార్టీల సభ్యులు చక్కగా ఆస్వాదించినట్లు చెబుతున్నారు. అయితే కార్పొరేటర్లు మేయర్‌కే మద్దతు పలకడంతో రవీందర్‌సింగ్‌ ఒంటరయ్యారట. 

మంత్రి గంగుల కమలాకర్‌కు తెలిసే జరుగుతోందా?

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అంతా మంత్రి గంగులకు తెలిసే జరుగుతోందని.. పైగా మంత్రి ఆశీసులు లేకుండా మేయర్‌ సునీల్‌రావు ఆ విధంగా మాట్లాడకుండా ఉండరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకపోతే... తొలి సమావేశంలో బయటపడ్డ విభేదాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనని చర్చించుకుంటున్నారు. అసలు విషయం పక్కకెళ్లి.. మేయర్‌, మాజీ మేయర్‌ మధ్య తగువే అందరినీ ఆకర్షిస్తోంది. మరి.. పార్టీ పెద్దలు వీరి మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి.