ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేకపోతున్నాయా?
ఒకరు అధికార పార్టీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యే. మరొకరు అధికార పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి టార్గెట్ నియోజకవర్గంలో పెత్తనం చెలాయించడమే. ఈ విషయంలో ఆ ఇద్దరు నేతలూ గట్టిగానే పోటీపడుతున్నారట. మధ్యలో అధికారులకు మద్దెలదరువు తప్పడం లేదట.
చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి!
చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా చీరాల ఇప్పుడు పొలిటికల్ వార్కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అధికార పార్టీలో నేతల మధ్య నెలకొన్న వార్ ఆ పార్టీ నేతలకే తలబొప్పికట్టించేంతగా ఉందట. కరణం వర్సెస్ ఆమంచిగా రాజకీయం మారడంతో పరిణామాలన్నీ హాట్ టాపిక్‌గా మారినట్లు చెవులు కొరుక్కుంటున్నారు.
పెత్తనం చెలాయించేందుకు నేతల యత్నం!
నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ ముఖ్యమైన లీడర్లు కావడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ ప్రాంతంలో ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు ఒకే ఫ్యాన్ కిందకు చేరారు. ఉప్పు నిప్పుగా ఉన్నవారి మధ్య ఆధిపత్యపోరుకు తెరలేచింది. నాయకులు ఎవరికి వారు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారట. దీంతో ప్రభుత్వ పెద్దలకు, యంత్రాంగాలకు వీరి మధ్య పంచాయితీలు తలనొప్పిగా మారినట్లు టాక్.
ఎన్నికల్లో ఓడినా చీరాలలో ఆమంచి మాటే నెగ్గేది!
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమంచిపై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. ఆమంచి ఓడినా రాష్ట్రంలో YCP అధికారంలోకి రావడంతో చీరాలో ఆయన మాటే నెగ్గేది. అధికారం చెలాయిస్తూ వచ్చారు. ఆమంచి అనుమతి లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి ఉండేది. అధికారుల బదిలీలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి.
ఆమంచి మాట వినిపించకుండా పావులు కదుపుతున్న కరణం!
ఎమ్మెల్యేగా గెలిచినా.. చేతిలో పవర్ లేకపోవడంతో ఇబ్బంది పడ్డ కరణం బలరామ్.. అనూహ్యంగా సీఎం జగన్‌కు జై కొట్టారు. కుమారుడు వెంకటేష్‌కు దగ్గరుండి సీఎం జగన్‌తో కండువా కప్పించారు. ఆ విధంగా కరణం సైతం అధికార పార్టీ నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. అప్పటి నుంచి చీరాలలో ఆమంచికి పోటీగా కరణం కదపని పావులు.. వేయని ఎత్తులు లేవట. నియోజకవర్గంలో ఆమంచి మాట వినిపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎటు చూసినా తన ముద్రే ఉండాలన్నది ఆయన పంతంగా చెబుతున్నారు.
కరణానికి మంత్రి బాలినేని అండ?
YCP ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బదిలీపై వచ్చిన పోలీస్, రెవెన్యూ అధికారులను మార్చాలంటూ కరణం ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన చేసే ప్రయత్నాలకు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు ఉన్నట్లు అధికార పార్టీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు పోలీసులపై బదిలీ వేటు పడటంతో దాని వెనుక కరణం హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండే అధికారులకే చీరాలలో పోస్టింగ్‌లు ఇస్తున్నారట.
పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్న ఆమంచి!
సీఎం జగన్‌కు జై కొట్టి... అధికార పార్టీకి మద్దతిచ్చిన తర్వాత చీరాలలో కరణం బలరామ్ కు ప్రయారిటీ ఇవ్వడం ఆమంచికి ఇబ్బందిగా మారిందట. దీనిపై ఇప్పటికే వైసీపీ ముఖ్య నాయకుల దగ్గరకు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలను ఆయన తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే కరణం కూడా ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారట.
సర్ది చెప్పలేక తల పట్టుకుంటున్న అధికారులు!
ఈ పరిణామాలతో చీరాలలో రాజకీయం కరణం వర్సెస్ ఆమంచిగా మారింది. నియోజకవర్గంలో ముఖ్యులుగా ఉన్న ఇద్దరిలో ఎవరినీ కాదనలేకపోతున్నారట. ఈ మద్దెలదరువుతో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి దినదినగండంగా మారిందని టాక్. ఎవరికీ సర్దిచెప్పలేక తల పట్టుకుంటున్నారట. ప్రశాంతంగా ఉండే చీరాలలో ఉద్యోగం చేయాలని అనుకునే అధికారులు, ఉద్యోగులు ఇక్కడ నుంచి బయటపడితే చాలు అనుకుంటున్నట్లు సమాచారం. మరి.. ఈ ఆధిపత్య పోరు రానున్న రోజుల్లో ఇంకా ఎన్నిమలుపులు తిరుగుతుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)