చీరాలలో ఫ్లెక్సీ కలకలం..

చీరాలలో ఫ్లెక్సీ కలకలం..

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్పు పై సందిగ్ధం నెలకొన్న సమయంలో ఇప్పుడు కరణం బలరాం ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇటీవలే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. టీడీపీ వీడాలని నిర్ణయానికి వచ్చి వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. అయితే, ఆమంచితో చర్చలు జరిపిన మంత్రి శిద్దా రాఘవరావు ఆయనను బుజ్జగించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో ఆమంచి భేటీ అయ్యారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే అంశం తాత్కాలికంగా సద్దుమణిగిందని అంతా భావిస్తున్న సమయంలో.. చీరాల రాజకీయాల్లోకి రావాలంటూ ఎమ్మెల్సీ కరణం బలరాంని ఆహ్వానిస్తూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. చీరాల ప్రధాన సెంటర్ అయిన రైల్వే స్టేషన్ ఎదుట భారీ ఫ్లెక్సీ కట్టారు. టీడీపీని నమ్మించి మోసం చేసిన నాయకులకు బుద్ది చెప్పేందుకు రావాలంటూ ఫ్లెక్సీపై రాసుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత కార్యకర్తలతో సమావేశమై పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పెద్దఎత్తున చర్చకు దారితీసింది.