వికాస్ భల్ పై కంగనా... ప్రేమ... పగ!

వికాస్ భల్ పై కంగనా... ప్రేమ... పగ!

పొగిడినంత శ్రద్ధగా తిడుతుంది! తిట్టినంత ఘాటుగా పొగుడుతుంది! తనే... ‘క్వీన్’ ఆఫ్‌ బాలీవుడ్... కంగనా రనౌత్! ఈసారి ఎవర్నీ తిట్టలేదుగానీ... గతంలో తిట్టిపోసిన దర్శకుడ్ని... పొగిడేసింది! నీ వల్లే ఇవాళ్ల నేను ఇలా ఉన్నానంటూ నిజం ఒప్పుకుంది! ‘క్వీన్’ సినిమా కంగనా జీవితంలో పెద్ద మలుపు. ఆమెని నిజంగా బీ-టౌన్ క్వీన్ గా మార్చేసింది వికాస్ భల్ మూవీ. పదేళ్లు కంగనా ఏ గుర్తింపు కోసమైతే తహతహలాడిందో... అదంతా ఒక్కసారిగా బాక్సాపీస్ ని బద్దలుకొట్టుకుని బయటకొచ్చి అద్భుతం సృష్టించింది. అయితే, ట్విస్ట్ ఏంటంటే... ‘క్వీన్’ చిత్రం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వయంగా కంగనానే ఓ విషయం బయటపెట్టింది.

ఆమె సదరు సినిమాని కేవలం డబ్బుల కోసమే ఒప్పుకుందట. అంతే కాదు, సినిమా పూర్తి చేసి... చేతికందిన రెమ్యూనరేషన్ తో న్యూయార్క్ వెళ్లిపోయింది మన ‘మణికర్ణిక’. అక్కడ స్క్రీన్ రైటింగ్ లో ఓ కోర్స్ కూడా చేసింది. లాస్ ఏంజెల్స్ లో స్థిరపడి అక్కడే దర్శకత్వ శాఖలో పని చేయాలనుకుంది. కానీ, ఆమె ఆలోచనలన్నీ ‘క్వీన్’ విడుదలతో మారిపోయాయి. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్ కాదని కంగనానే అనుకుందట. అందుకే, ‘క్వీన్’ విడుదల, అనూహ్య విజయం, జాతీయ అవార్డు రావటం... అంతా ఆశ్చర్యం అంటోంది ‘తనూ వెడ్స్ మనూ’ బ్యూటీ! ‘క్వీన్’ విడుదలై తనకు ఎంతో గుర్తింపు తెచ్చినప్పటికీ... కంగనా ఆ సినిమా డైరెక్టర్ కి తరువాత పెద్ద షాక్ ఇచ్చింది.

అతనిపై ఒకమ్మాయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తే మిస్ రనౌత్ మద్దతిచ్చింది. ‘క్వీన్’ డైరెక్టర్ వికాస్ భల్ తనతోనూ అతిగా ప్రవర్తించేవాడ్ని కుండబద్ధలు కొట్టింది. గట్టిగా హత్తుకోవటం, మెడ వంపులో తన ముఖం ఉంచటం, వెంట్రుకల వాసన చూడటం... ఇలాంటి పనులు పదే పదే చేసేవాడని తీవ్ర ఆరోపణలు చేసింది. వికాస్ కి చాలా మందితో శృంగార సంబంధాలున్నాయని కంగనా సూటిగా చెప్పింది. కానీ, ఇప్పుడు అదే వికాస్ భల్ కి ట్విట్టర్ లో పబ్లిగ్గా థాంక్స్ చెప్పింది. ‘క్వీన్’లో ఆయన తనకి రోల్ ఇచ్చి ఉండకపోతే... ఇవాళ్ల తానున్న స్థితిలో ఉండేదాన్ని కాదని మొహమాటం లేకుండా అంగీకరించింది. ‘’మన వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నా మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను’’ అంటోంది కంగనా! అయినా... ఇలా ప్రేమతోనూ, పగతోనూ... రెండు విధాల ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కాబట్టే... కంగనా కంగన అయింది! లేదంటే రొటీన్ బాలీవుడ్ బ్యూటీగా మిగిలిపోయి ఉండేదే కదా!