శివాజీ బాటలోనే... కమల్ హాసన్!

శివాజీ బాటలోనే... కమల్ హాసన్!

నడిగర్ తిలగమ్ శివాజీ గణేశన్ కు విలక్షణ నటుడు కమల్ హాసన్ వీరాభిమాని అందరికీ తెలుసు. శివాజీ గణేశన్ సైతం తన అసలైన నటవారసుడు కమల్ హాసన్ అని పలుమార్లు పేర్కొన్నారు. శివాజీ గణేశన్ వందలాది చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. అదే తీరున కమల్ సైతం శివాజీ బాటలోసాగి పలు వైవిధ్యమైన పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. చిత్రమేమంటే శివాజీ గణేశన్ ఎంతటి ఉత్తమమైన అభినయాన్ని ప్రదర్శించినా, ఆయనకు ఉత్తమ నటునిగా ఏ నాడూ జాతీయ అవార్డు లభించలేదు. కానీ, ఆయన వీరాభిమాని అయిన కమల్ హాసన్ మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన తొలి యాక్టర్ గా చరిత్ర సృష్టించాడు. 

సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలనుకున్నాడు కమల్ హాసన్. శివాజీ మొదట డి.ఎమ్.కె.లోనూ, తరువాత కాంగ్రెస్ లోనూ ఉన్నారు. దక్షిణ భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వహించారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు పోటీ చేసినప్పుడు, ఆయనకు శివాజీ గణేశన్ వచ్చి ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాంటి శివాజీ గణేశన్ చాలా కాలం సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఎమ్జీఆర్ కు వ్యతిరేకంగా పనిచేశారు. ఎమ్జీఆర్ అన్నాడిఎమ్.కె.పార్టీ పెట్టి 1977లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత బర్తరఫ్ అయ్యారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయి, కన్నుమూసే దాకా ఆ పదవిలోనే ఉన్నారు. ఎమ్జీఆర్ మరణంతో తమిళ రాజకీయాల్లో తాను చక్రం తిప్పవచ్చునని శివాజీ భావించి, 1988లో 'తమిళగ మున్నేట్ర మున్నాని' అనే పార్టీ పెట్టి, 1989 ఎన్నికల్లో పోటీ చేసి, ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయారు. తానూ ఓడిపోయారు. 

శివాజీ శిష్యుడైన కమల్ హాసన్ కూడా ఈ మధ్యే 'మక్కల్ నీది మయమ్' అనే పార్టీ పెట్టి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 37 మందిని తన పార్టీ తరపున నిలిపారు. ఒక్కరూ గెలవలేదు. ఇప్పుడు తాజాగా తమిళనాట జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ స్వయంగా పోటీ చేయడమే కాకుండా, తన పార్టీ తరపున 142 మందిని పోటీకి దింపారు. ఈ సారి గురువు శివాజీ రికార్డును కమల్ బ్రేక్ చేస్తాడని భావించారు. అయితే, దక్షిణ కొయంబత్తూరు నుండి పోటీ చేసిన కమల్ హాసన్, బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్లతో పరాజయం చవిచూశారు. మొదటి రౌండ్స్ లో కమల్ విజయం సాధిస్తాడని, నేషనల్ అవార్డ్స్ లో లాగే గురువు శివాజీని మించిపోతాడని భావించారు. కానీ, రాజకీయాల్లో మాత్రం గురువు బాటలోనే కమల్ కూడా పయనించాల్సి వచ్చింది.