కేసీఆర్ కు కళా బహిరంగ లేఖ

కేసీఆర్ కు కళా బహిరంగ లేఖ

ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ జెండా నీడలో దాక్కొని సీఎం కేసీఆర్ ఏపీపై దొంగ యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. 'వైఎస్ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు అదే వారసత్వాన్ని తలకెత్తుకున్నారు. జగన్ ను సామంత రాజుగా చేసుకొని ఏపీ వనరులను కేసీఆర్ దోచుకోవాలనుకుంటున్నారు. జగన్ కి మద్ధతు పలికి కృష్ణా, గోదావరి జలాలను కేసీఆర్ దోచుకోవాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను రావణకాష్టంగా మార్చే కుట్రలు చేస్తున్నారు. నవ్యాంధ్ర పరిశ్రమలను దెబ్బకొట్టేందుకు నౌకాశ్రయాలను దక్కించుకోవాలని చూస్తున్నారని' కళా లేఖలో పేర్కొన్నారు.

'జగన్ ను తెలంగాణ జైళ్లలో కూడా పెట్టొద్దని నిజామాబాద్ ఎంపీ కవిత గారు అనలేదా?. హైదరాబాద్ లో ఆస్తులున్న ప్రతి ఒక్కరినీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా అల్టిమేటం జారీ చేశారు. కుట్రలు, దొంగ దెబ్బలపై జగన్, అతని అనుచరులకు కేసీఆర్ శిక్షణనిస్తున్నారు. టీడీపీపై బురద జల్లేందుకు సినీ నటులను ఉసిగొల్పలేదా?. హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేయడం కాదు.. ధైర్యముంటే ఏపీలో ప్రత్యక్షంగా పోటీ చేయండి' అని లేఖ ద్వారా కళా సవాల్ విసిరారు.