అన్నదాత సెగ..! బీజేపీ సీనియర్ల అత్యవసర భేటీ..

అన్నదాత సెగ..! బీజేపీ సీనియర్ల అత్యవసర భేటీ..

కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు రైతుల నిరసన సెగ తగిలింది.. దీంతో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అత్యవసరంగా సమావేశం అయ్యారు బీజేపీ అగ్రనేతలు... ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు హాజరయ్యారు.. ఓవైపు రైతుల ఆందోళనలు ఉధృతం అవుతున్న సమయంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రైతులకు చర్చలకు సిద్ధమని.. ప్రభుత్వం ప్రకటించినా.. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవడమే ప్రధాన డిమాండ్‌ అని రైతు సంఘాల నేతలు తెగేసి చెప్పడంతో.. ప్రభుత్వానికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. రైతుల ఆందోళనకు ఎలా పులిస్టాప్ పెట్టాలి.. వారికి ఎలా నచ్చజెప్పాలి, ఆందోళన ఎలా విరమింపజేయాలి అనే దానిపై బీజేపీ అగ్రనాయత్వం దృష్టిసారించింది. కాగా, రైతులు బురారీ మైదానానికి వెళ్లాలన్న ప్రభుత్వ సూచనకు రైతులు నో చెప్పారు. జంతర్ మంతర్ లేదా రామ్‌లీలా మైదానంలో నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన అజెండా అని తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిరసనలు విరమించేది లేదన్నారు. ఢిల్లీ వెళ్లే 5 ప్రధాన రహదారులపై బైఠాయిస్తాం.. మా డిమాండ్లకు కేంద్రం స్పందించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు రైతులు.