బైడెన్‌ పట్టాభిషేకం నేడే... భారతీయులకు ఎన్నో ఆశలు..!

బైడెన్‌ పట్టాభిషేకం నేడే... భారతీయులకు ఎన్నో ఆశలు..!

ఎన్నో వివాదాలు.. ఇంకా ఎన్నో విమర్శలు, వివాదాస్పద నిర్ణయాలు, సంచలన వ్యాఖ్యలు.. దురుసు ప్రవర్తన, ఎవ్వరైతే నాకేంటి అనే భావన.. ఇలా ఇంత కాలం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన డొనాల్డ్‌ ట్రంప్‌ బైబై చెప్పేసే టైం దగ్గర పడింది.. మరికొన్ని గంటల్లోనే అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌ ఉరఫ్‌ జో బైడెన్‌ అలియాస్ జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. 78 ఏళ్ల వయస్సులో ఆయన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. విజయం సాధించారు బైడెన్.. అయితే.. ఈ విజయాన్ని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదు. చివరకు ఆ దేశ కేపిటల్ భవనంపైనే దాడి జరిగింది.. వాషింగ్టన్లోని కేపిటల్‌ భవనంపైకి దూసుకొచ్చిన ట్రంప్ మద్దతుదారులు... విధ్వంసం సృష్టించారు.. కొంతమంది ప్రాణాలు పోగా.. చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే, అదే కేపిటల్‌ హిల్‌ భవనం సాక్షిగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనన్నారు బైడెన్.. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ కూడా ప్రమాణం చేస్తారు.

ఇక, ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.. కేపిటల్‌ భవనంపై దాడిని దృష్టిలో ఉంచుకొని.. గతంలో ఎన్నడూలేని విధంగా 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌తో వాషింగ్టన్‌లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. భద్రతాసిబ్బందిలో ఎవరైనా ట్రంప్‌-అనుకూలురు దాడి చేస్తారేమోనన్న భయం కూడా ఉండడంతో సీక్రెట్‌ సర్వీస్‌, ఆర్మీ ఏ ఛాన్సూ తీసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా అతివాద జాతీయవాదులు హింసా విధ్వంసాలకు దిగొచ్చన్న సమాచారం రావడంతో మొత్తం 50 రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో.. బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవం కాస్త నిరాడంబరంగానే సాగనుందని చెబుతున్నారు. అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రమాణస్వీకారోత్సవ అనంతరం.. శ్వేతసౌధంలో అడుగుపెట్టనున్నారు బైడెన్... మరోవైపు అమెరికన్ సంప్రదాయాలకు విరుద్ధంగా డొనాల్డ్‌ ట్రంప్‌ - బైడెన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకావడంలేదు.. ఈ విషయాన్ని ఆయన ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.. 1869లో ఆండ్రూ జాన్సన్‌ తర్వాత ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రమాణస్వీకారోత్సవాన్ని బాయ్‌కాట్‌ చేయడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఓవైపు బైడెన్ ప్రమాణస్వీకారం కొనసాగుతోన్న సమయంలోనే.. ట్రంప్‌ వైట్‌హౌస్‌ను వీడనున్నారు.. తన భార్య మెలానియాతో కలిసి ఆయన జాయింట్‌ బేస్‌ ఏండ్రూస్‌ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిపోనున్నారు. బైడెన్‌ ప్రమాణస్వీకార సమయానికి ఆయన ఫ్లోరిడాలో తన నివాసానికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే, తాను ఒక మాజీ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌ను వీడడం ఇష్టం లేదని సన్నిహితుల దగ్గర ట్రంప్‌ చెప్పినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఇక, తన వీడ్కోలు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ట్రంప్ భావించారట.. కానీ, కేపిటల్‌ భవనంపై దాడితో భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక, చివరి రోజు కీలక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే బైడెన్ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి.. ఎందుకంటే.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌.. అగ్రరాజ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బకొట్టింది.. కరోనాను ఎదుర్కోని నిలబడడమే ఆయన ముందున్న ప్రధాన టార్గెట్ కానుంది. ఇక, బైడెన్.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే చర్చ సాగుతోంది.. భారత ప్రధాని మోడీ తనకు అత్యంత సన్నిహితుడంటూ చెప్పుకునేవారు డొనాల్డ్ ట్రంప్.. దానికి అనుగుణంగానే ఉండేవారు ప్రధాని మోడీ.. ఇరువురిదీ జాతీయవాద ఎజెండాయే. చైనాను ప్రతిఘటించే విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌కు బాసటగా నిలిచింది. బైడెన్‌ కూడా అదే బాటలో నడుస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో... అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారతీయులకు పెద్ద ఊరటగా చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ అనుసరించిన కఠినమైన వలస విధానాన్ని బైడెన్‌  పూర్తిగా మార్చేయనున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన తొలి వ్యక్తిగా కమలా హ్యారీస్‌ రాబోతున్నారు. ఇదికూడా భారత్‌కు కలిసివచ్చే అంశంగానే చెబుతున్నారు.