'దృశ్యం-3' వస్తుందా?

'దృశ్యం-3' వస్తుందా?

దృశ్యంకు సీక్వెల్‌గా వ‌చ్చిన దృశ్యం-2 విడుద‌లై సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను బాషాభేదం లేకుండా అందరూ ఆదరిస్తున్నారు. నిజానికి మన దేశంలో వ‌చ్చిన అత్యుత్తమ సీక్వెల్స్‌లో 'దృశ్యం2' ఒక‌టి అని చెప్పవచ్చు. సినిమా చూసిన వారవరైనా ఈ మాట‌తో ఖచ్చితంగా ఏకీభ‌విస్తారు. నిజానికి 'దృశ్యం' సినిమాకు సీక్వెల్ వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఎందుకంటే దర్శకనిర్మాతలు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయితే గ‌త ఏడాది క‌రోనా త‌ర్వాత జీతు జోసెఫ్‌-మోహ‌న్ లాల్ హ‌ఠాత్తుగా సీక్వెల్ ను మొద‌లుపెట్టారు. శర‌వేగంతో పూర్తి చేశారు. గ‌త శుక్రవారం విడుద‌లైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంతలా అంటే విడుదలకు ముందు ఒటీటీలో విడుదలయ్యే ఈ సీక్వెల్ తెలుగులో తను చేయకపోవచ్చు అని అన్న వెంకటేశ్... విడుదల తర్వాత రీమేక్ కి సిద్ధపడేంతగా. అతి త్వరలో తెలుగు వెర్షన్ సీక్వెల్ సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

ఇదిలా ఉంటే దృశ్యం-2 చూసిన వారికి ఈ క‌థ‌కు కొన‌సాగింపుగా మూడో పార్ట్ కూడా వ‌స్తుందేమో అన్న సందేహాలు త‌లెత్తాయి. నిజానికి క‌థ‌లో ఆ స్కోప్ ఉంది కూడా. ఈ విష‌యంపై ద‌ర్శకుడు జీతు జోసెఫ్‌ను ప్రశ్నించినపుడు ప్రస్తుతానికి దృశ్యం-3 ఆలోచ‌న లేదంటున్నాడు. భ‌విష్యత్తులో లైన్ దొరికితే మాత్రం చేయొచ్చంటున్నాడు. సీక్వెల్ కి ఇలాంటి స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని... తెలుగులో వెంక‌టేష్ హీరోగా దృశ్యం-2 చేస్తున్న విష‌యాన్ని మాత్రం ధ్రువీక‌రించాడు జీతు జోసెఫ్‌. దృశ్యంలా సీక్వెల్ ను మిగ‌తా భాష‌ల్లో రీమేక్ చేయడం గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేద‌ంటున్నాడు.