జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల.. బెదిరే ప్ర‌స‌క్తేలేదు..

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల.. బెదిరే ప్ర‌స‌క్తేలేదు..

బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే జీసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి... కడప సెంట్ర‌ల్ జైల్ నుండి విడుద‌ల‌య్యారు.. వీరికి అనంత‌పురం కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయ‌డంతో.. విడుద‌ల చేశారు జైలు అధికారులు.. అక్రమ వాహన రిజిస్ట్రేషన్, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల తయారీ కేసుల్లో జూన్ 13న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. 54 రోజుల పాటు కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి.. బెయిల్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలే చేశారు.. ప‌లుమార్లు బెయిల్ పిటిష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. చివ‌ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ వ‌చ్చింది.  

ఇక‌, బెయిలు పేపర్లు తానే స్వయంగా జైలు వ‌ద్ద‌కు తీసుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి.. ఆయ‌న వెంట పెద్ద సంఖ్య‌లో అభిమానులు, టీడీపీ శ్రేణుల‌కు కూడా త‌ర‌లిరావ‌డంతో.. పెద్ద సంఖ్య‌లో మోహ‌రించిన పోలీసులు.. వారిని అక్క‌డి నుంచి పంపించారు.. ఇక‌, ఈ సంద‌ర్భంగా జెసీ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని ఆక్రమ కేసులు పెట్టినా భయపడేది లేద‌న్నారు.. ఈ నాలుగేళ్ల‌లో ఎన్నో కేసులు పెట్టే అవ‌కాశాలున్నాయ‌ని.. అయినా బెదిరే ప్రసక్తే లేద‌ని ప్ర‌క‌టించారు.. తనతో పాటు తన తండ్రిపై కూడా కేసులు పెట్టే అవ‌కాశం కూడా ఉంది.. అయితే.. మాకు అధికారం వస్తుంది.. ఇంతకు పదింతలు చూపిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. మ‌రోవైపు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫ‌ల్యం చెందింద‌ని విమ‌ర్శించారు జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి.