జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు... వారికి రెట్టింపు సత్కారం..!

జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు... వారికి రెట్టింపు సత్కారం..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి... సున్నపురాయి గనుల లీజు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ గనుల్లో అధికారులు తనిఖీలు చేయడంతో.. తాడిపర్తి గనులశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపుస్థాయిలో సన్మానం ఉంటుందంటూ హెచ్చరించారు. నియంతపాలన ఎన్నిరోజులు ఉంటుందో చూస్తామని.. దీనికి ఫలితం అనుభవించకతప్పదని ఫైర్ అయ్యారు. ఇక, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జేసీ దివాకర్‌రెడ్డి... తన సోదరుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టారని గుర్తుచేశారు. తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానని.. లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. భార్య, చెల్లి పేరుతో గనులు ఉన్నాయని చెప్పారు. అయితే ఆ గనులను శోధించడానికి వాహనాల్లో 50 నుంచి 60 మంది వెళ్లారు. వారిని చూసి ఇంతకీ వీళ్లెవరబ్బా..? అని అనుకున్నానని వ్యాఖ్యానించారు జేసీ. 

ఇక అధికారుల సోదాలపై తనదైన శైలిలో స్పందించారు జేసీ.. వైజాగ్ నుంచి నక్సలైట్లు ఏమైనా గనులకు వచ్చారా.? అని అనుకున్నానని వ్యాఖ్యానించిన ఆయన.. పోలీసులు.. నక్సలైట్ల కోసం గాలిస్తున్నారేమో అనుకున్నాను. గనులు సొరంగం లాగా ఉన్నాయి. అందుకే పోలీసులు కూంబింగ్‌కు వచ్చారని అనుకున్నాను. వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఇతర నేతల గనులున్నా.. నా భార్య పేరుతో ఉన్న గనులను మాత్రమే శోధించారు. వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధించేందుకే ఇదంతా చేశారని మండిపడ్డారు.. తన కుటుంబంపై కేసులన్నీ కక్ష సాధింపులో భాగమేనంటూ ఆరోపించారు జేసీ దివాకర్‌రెడ్డి...