బుమ్రా గాయంపై బీసీసీఐ కీలక ప్రకటన

బుమ్రా గాయంపై బీసీసీఐ కీలక ప్రకటన

టీమిండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రాకు అయిన గాయం చిన్నదే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ ప్రకటించింది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బుమ్రా గాయపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ చివరి బంతి బౌలింగ్‌ చేశాక.. ఎదురుగా వస్తున్న బంతిని ఆపబోయి బుమ్రా కింద పడ్డాడు. బుమ్రా ఎడమ భుజంకి బలంగా గాయం కావడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానంలోనే పడుకున్నాడు. అనంతరం ఫిజియో వచ్చి చికిత్స చేసాడు. పెవిలియన్‌కు వెళ్లిన బుమ్రా .. ముంబయి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో వికెట్‌ పడ్డా కూడా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడి గాయంపై అందరికి అనుమానాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. 'బుమ్రా గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎడమ భుజానికి నిర్వహించిన వైద్య పరీక్షలలో గాయం చిన్నదేనని తేలింది. స్కానింగ్‌ రిపోర్ట్‌ కూడా మామూలుగానే ఉంది. బుమ్రా కోలుకున్నాడు. ముంబైకి విజయావకాశాలు లేకపోవడంతో.. ముందు జాగ్రత్తగా బుమ్రాను బ్యాటింగ్‌కు పంపలేదు.' అని ఆ అధికారి స్పష్టం చేశారు.

అయితే ముంబై ఇండియన్స్‌ జట్టు ఇప్పటికే బెంగళూరు చేరుకోగా..  బుమ్రా ఇంకా ముంబైలోనే ఎందుకు ఉన్నాడన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 'స్కానింగ్‌ రిపోర్ట్‌ వచ్చే వరకు ఆలస్యం అయింది. అప్పటికే జట్టు బెంగళూరుకు బయలుదేరింది. బుమ్రా ఒక్కడే ప్రత్యేకంగా ప్రయాణం చేస్తాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లో బుమ్రా ఆడతాడు' అని చెప్పుకొచ్చారు.