నవ్వుల విందులు చేసిన జంధ్యాల

నవ్వుల విందులు చేసిన జంధ్యాల

"నవ్వు ... నవ్వించు.. ఆ నవ్వులు పూయించు..." అన్నారు పెద్దలు. "నవ్వు నాలుగందాల చేటు కాదు నాలుగు వందల విధాలా గ్రేటు" అనీ సెలవిచ్చారు మరికొందరు పెద్దలు. వారిని అనుసరిస్తూనే "నవ్వడం యోగం... నవ్వించడం భోగం... నవ్వకపోవడం రోగం..." అంటూ మరో నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. వారిలో పసందైన పదాలు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి. విచారానికి విరుగుడు వినోదమే అన్నట్టు ఎవరైనా మనసు బాగోలేకపోతే జంధ్యాల మాటలను, లేదా ఆయన సినిమాల్లోని నవ్వుల సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటే చాలు అన్నీ పటాపంచలై పకపకలు మన సొంతమవుతాయి. 

పసందైన పదవిన్యాసాలు 
గొప్ప రచయిత ఎవరు? అంటే ఎప్పుడు ఏ పదాన్ని ఏ స్థాయిలో వినియోగించాలో బాగా తెలిసినవాడే గొప్ప రచయిత అంటారు పండితులు. ఆ విషయంలో జంధ్యాల తన తరం రచయితల్లో గొప్పవారు. అందులో ఎవరికీ ఏ సందేహమూ లేదు. సమకాలీనులు సైతం జంధ్యాలలాగా మాటలు రాయాలని తంటాలు పడుతున్నాం అనేవారు. అంటే జంధ్యాల మాటల్లోని తూకం ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది. పకపకలు పలికించే చోట జంధ్యాల పదాలు పరుగులు తీస్తాయి. అదే కన్నీరు పెట్టించే సన్నివేశంలో మనసుల్ని తాకే పదాలతోనే పయనించేవారు. ఇక వీరోచితం ప్రదర్శించడంలోనూ 'అన్న అడవిరాముడు'ను తలపిస్తారు. ఇలా జంధ్యాల మాటల తూటాలు పేలిన వైనాన్ని  చెప్పుకుంటూ పోతే స్థలం చాలదు. ఇక ఆయన చేసి వడ్డించిన భాషాపరోటాలను ఆరగించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పింగళి వారి బాణీని పట్టేసినట్టే కనిపిస్తుంది కానీ, జంధ్యాల మార్కు మాటల తీరు వేరుగా ఉంటుంది. ఎందుకలా అనిఅడిగేరు - "చరిత్ర అడక్కు... చెప్పింది విను..." అనాల్సి వస్తుంది. ప్రాస కోసం ప్రయాసపడి పరేషాన్ చేసేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ, ఏ భాషలోనైనా, ఏ యాసతోనైనా ప్రాసల పాయసాలు చేయగల నేర్పు ఓర్పు జంధ్యాల సొంతం. పదాలతో రిథమ్ సృష్టించగల దిట్ట జంధ్యాల. కావాలంటే "ఈస్ట్, పేస్ట్, టోస్ట్..." అంటూ 'వేటగాడు'లో జంధ్యాల కలం పలికించిన పదవిన్యాసాలతో కాసేపు సాగండి. మళ్ళీ మళ్ళీ  ఆ యాసతో సాగినా ఏ ఆయాసం మీ దరి చేరదు. పై పెచ్చు  వీలుంటే మరోమారు ఆ పదవిన్యాసాలతోనే సాగాలనిపిస్తుంది. 

ఓ వరం!
'విజయావారి'లాగా వినోదాలతోనే జనాన్ని మైమరపించాలని ఎందరో రచయితలు భావించేవారు. అలా రచనలు చేసి ఆకట్టుకున్న వారికి కొదవే లేదు. ఆ రీతినే ఎంచుకున్నారు జంధ్యాల. మెగాఫోన్ పట్టి ఏకబిగిని  సినిమాలు తీశారు. ఆ తీతలోనూ, ఆయన రాతలోనూ మనసులను కట్టిపడేసిన సన్నివేశాలూ ఉన్నాయి. గిలిగింతలు పెట్టిన మాటల కోటలూ ఉన్నాయి. వాటిలో ఒకసారి  ప్రవేశిస్తే చాలు మళ్లీ రావాలనిపించదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ కోటలు బీటలు వారకుండా తెలుగువారికి నేటికీ వినోదాల విందు అందిస్తూనే ఉన్నాయి. ఇంతలా వినోదాలు పంచిన జంధ్యాల నటనలోనూ ఘటికుడే అనిపించుకున్నారు. కె. విశ్వనాథ్ తలపులో మెరసిన ఓ ఊహకు తన అభినయంతో జంధ్యాల ప్రాణం పోసిన తీరును 'ఆపద్బాంధవుడు'లో చూసి తీరాల్సిందే. బహుముఖ ప్రజ్ఞతో భాసిల్లిన జంద్యాల  ప్రతిభాపాటవాలను మననం చేసుకున్న ప్రతీసారి మనసు మహదానందంతో చిందులు వేస్తూనే ఉంటుంది. అందుకే విజ్ఞులు అంటారు - 'జంధ్యాల అంటే తెలుగువారికి లభించిన ఓ వరం' అని. కాదంటారా? కాదనేవారు అసలు కనిపిస్తేగా!