వారి పరీక్షలను కూడా రద్దు చేసి..పాస్ చేయండి :పవన్ కళ్యాణ్

 వారి పరీక్షలను కూడా రద్దు చేసి..పాస్ చేయండి :పవన్ కళ్యాణ్

డిగ్రీ,పీజీ,బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించకుండా ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రకటనను విడుదల చేసారు. "కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా ఉత్తీర్ణత ప్రకటించాలన్నారు. డిగ్రీతోపాటు ఎంబీఏ,పాలిటెక్నిక్,ఐటిఐ,బీటెక్ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కన్పించడం లేదు. విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలకు వెళ్లి పరీక్షా కేంద్రాలకు వెళ్లిరావడం శ్రేయస్కరం కాదు. మరోవైపు పై చదువులకు వెళ్లేందుకు..క్యాంపస్ సెలక్షన్లకు వెళ్ళడానికి సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు నిర్వహించని కారణంగా పట్టాలు చేతికిరాక తాము నష్టపోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్థులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయాలి. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాయి. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి" అంటూ పవన్ కళ్యాణ్ ట్విటర్ లో ప్రకటన చేసారు.