రాజోలు ఎమ్మెల్యే రాపాకపై జనసైనికులు రివెంజ్ తీర్చుకున్నారా...?

రాజోలు ఎమ్మెల్యే రాపాకపై జనసైనికులు రివెంజ్ తీర్చుకున్నారా...?

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై జనసైనికులు రివెంజ్‌ తీర్చుకున్నారా? పార్టీకి నాయకుడే లేని చోట జనసేన కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త రణతంత్రం రచించారా? శత్రువుకు శత్రువు తమకు మిత్రుడనే సూత్రంతో పల్లెల్లో పాగా వేశారా? ఇంతకీ రాజోలు పంచాయతీ పోరు ఫలితాలు చెబుతున్నదేంటి? 

రివెంజ్‌ తీర్చుకోవడానికి  ఎదురు చూశారా? 

రాపాక వరప్రసాద్‌. ఏపీలో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే. తాను 152వ నెంబర్‌ను కాదల్చుకోలేదని.. నెంబర్‌ వన్‌గానే ఉంటానని గెలిచిన కొత్తలో ఆయన చెప్పారు. ఈ మాటలకు జనసైనికులు విస్తృతంగా సోషల్‌ మీడియాలో ప్రచారం కల్పించారు. కానీ.. యూటర్న్‌ తీసుకోవడానికి రాపాక ఎక్కువ రోజులు తీసుకోలేదు. అనధికారికంగా అధికార పార్టీ పంచన చేరిపోయారు. జనసేనను.. జనసేనానిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అప్పటి నుంచి జనసైనికులకు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు టార్గెట్‌ అయ్యారు రాపాక. రివెంజ్‌ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ వచ్చారు. 

ఎమ్మెల్యేకు ఝలక్‌ ఇవ్వడమే లక్ష్యంగా వ్యూహం!

పంచాయతీ ఎన్నికలు రావడంతో.. రాజోలులో ఎమ్మెల్యే రాపాక ఆధిపత్యానికి గండికొట్టాలని జనసైనికులు భావించారట. నియోజకవర్గంలో జనసేనకు గుర్తింపు పొందిన నాయకులు లేరు. పై నుంచి నేతలు సహకరించకపోయినా.. ఎవరూ పెద్దగా టచ్‌లో లేకపోయినా స్థానిక ఎమ్మెల్యేకు ఒక ఝలక్‌ ఇవ్వాలనే లక్ష్యంతో పల్లెపోరులో అడుగులు వేశారట. బలం ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఒంటరిగా పోరాటం చేయడం.. బలం లేనిచోట వైసీపీ గెలవకూడదనే ఒకే ఒక లక్ష్యంతో టీడీపీకి మద్దతిచ్చారట. ప్రతిగా టీడీపీ కూడా కొన్ని గ్రామాల్లో జనసేన మద్దతుదారులకు సపోర్ట్ చేసినట్టు సమాచారం. 

రాజోలులో 11 చోట్ల జనసేన మద్దతుదారులు గెలుపు!
37 చోట్ల రెండోస్థానంలో జనసేన మద్దతుదారులు?

రాజోలు నియోజకవర్గంలో 60 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేసింది. ఈ 60లో 11 చోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలిచారు. మరో 12 చోట్ల టీడీపీ పాగా వేసింది. వైసీపీ 37 చోట్ల గెలిచింది. విశేషం ఏంటంటే..  37 చోట్ల కూడా రెండో స్థానంలో జనసేన నిలవడం. ఈ లెక్కలు చూసిన తర్వాత జనసైనికులు రాజోలులో కసిగానే పనిచేశారు అని చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే రాపాకకు బ్రేక్‌లు వేయాలనే పట్టుదలతో పవన్‌ అభిమానులు చేసిన వర్కవుట్‌ ఫలించిందని అనుకుంటున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గెలిచాడు.. వెళ్లిపోయాడు అన్న ఒకే ఒక్క లైన్‌తో ఎమ్మెల్యేపై  ఫైట్‌ చేశారట జనసైనికులు. 

జనసైనికులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్యే రాపాక?

పంచాయతీ పోరులో పార్టీ నుంచి ఆర్థిక సాయం అందకపోయినా.. పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు చందాలు వేసుకుని రాపాకతో సై అంటే సై అన్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ధన, అంగ బలం ముందు జనసేన కార్యకర్తలు ఏం పోటీ ఇస్తారులే భావించిన ఎమ్మెల్యేకు సైతం చివర్లో ముచ్చెమటలు పట్టేలా చేశారనే ప్రచారం మొదలైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంతూరు చింతలమోరి గురించి ప్రత్యేకంగా  చర్చించుకుంటున్నారు. ఈ ఊరిలో ఒక అభ్యర్థికి ఎమ్మెల్యే రాపాక మద్దతిస్తే.. వైసీపీ  అభ్యర్థిగా మరో వ్యక్తి పేరు ప్రకటించారు నియోజకవర్గం అధికారపార్టీ ఇంఛార్జ్‌ అమ్మాజీ. అతికష్టంమీద ఇక్కడ గట్టెక్కారట ఎమ్మెల్యే. అటు జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఝలక్‌కు... ఇటు సొంత పార్టీ నేతలు ఇచ్చిన షాక్‌కు ఆయనకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిందని అనుకుంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో జనసేన నుంచి రాపాక ఇంకా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారో చూడాలి.