ఎట్టకేలకు తేలిన జమ్మలమడుగు పంచాయ్తితీ !

ఎట్టకేలకు తేలిన జమ్మలమడుగు పంచాయ్తితీ !

వైసీపీ హైకమాండ్ కు కడప జిల్లా జమ్మలమడుగు పంచాయతీ చేరింది. గత కొంత కాలం నుంచి రామ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య నీరు- నిప్పు గా పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డితో రామ సుబ్బారెడ్డి  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీలోకి వచ్చి ఏడాది అయ్యిందని, ఈలోపు కోవిడ్ తీవ్రతరం కావడంతో జమ్మలమడుగు క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసే రంగం ఆలస్యమైందని అన్నారు. 

దశాబ్దాలుగా వర్గాలుగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అనుకున్నామని అందుకే ఈ రోజు రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిశారని అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉండటానికి ఆయనకు సముచిత గౌరవం ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చారని ఆయన అన్నారు. సుధీర్ రెడ్డి కష్టకాలంలో నిలబడి పోరాడారు..ఎమ్మెల్యేగా గెలిచారని, ఇక్కడ ముక్కుసూటి రాజకీయం చేయాలని సీఎం భావిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో సుధీర్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, ఆయనకి రామసుబ్బారెడ్డి తమ్ముడిలా సహకరిస్తారని అన్నారు. 2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటామని అన్నారు. 

నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్తానం ఇస్తామని అన్నారు. అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనే పార్టీ భావించిందన్న ఆయన రామసుబ్బారెడ్డికి పార్టీలో సమున్నత స్థాయి ఉంటుందని అన్నారు. జిల్లా రాజకీయాల్లో ఆయన కీలకంగా ఉంటారు..ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తారు..ఎంపీ అవినాష్ రెడ్డి కో ఆర్డినెట్ చేస్తారని అన్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని పార్టీలో క్రియాశీలకంగా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం చెప్పారని అన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇబ్బంది లేకుండా పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను చూసాం...బ్రహ్మాండంగా సీఎం నాయకత్వం పట్ల పట్టం కట్టారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు... నేను, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తామని ఆయన అన్నారు.