ఏపీలో ఆ పథకం మరోసారి వాయిదా..!

ఏపీలో ఆ పథకం మరోసారి వాయిదా..!

ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న విద్యా కానుకను..  జూన్‌లో స్కూళ్లు ప్రారంభం కాగానే ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే  కరోనా కారణంగా విద్యా సంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. పాఠశాలలను నవంబర్‌ రెండో తేది నుంచి తెరవనున్నారు. అయితే విద్యాకానుక కిట్లు ముందుగానే విద్యార్థులకు అందితే.. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులు యూనీఫామ్ కుట్టించుకునే అవకాశం ఉంటుందని భావించింది ప్రభుత్వం. ఈ నెల ఐదున పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజయవాడ దగ్గర కంకిపాడులో ఒక స్కూల్‌కు స్వయంగా వెళ్లి పథకాన్ని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల మరోసారి జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మళ్లీ ఎప్పుడు ఉండేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

కాగా, ఈ పథకం ద్వారా 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, మూడు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నారు. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు, వివిధ అంశాలను నేర్చుకునే నైపుణ్యాలను పెంచటం ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం వల్ల నాలుగు లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందుతారు. ప్రభుత్వంపై 650 కోట్ల భారం పడనుంది.