ప్రతి పదిలక్షలమందికీ 47,459 మందికి పరీక్షలు చేశాం..మోడీతో సమావేశంలో జగన్ !

ప్రతి పదిలక్షలమందికీ 47,459 మందికి పరీక్షలు చేశాం..మోడీతో సమావేశంలో జగన్ !

కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ లో హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా 25 లక్షలకు పైగా పరీక్షలు చేశామని జగన్ అన్నారు. ప్రతి పదిలక్షలమందికీ 47,459 మందికి పరీక్షలు చేశామని, మరణాలు రేటు 0.89 శాతంగా ఉందని అన్నారు.

క్లస్టర్ల లోనే 85 శాతం నుంచి 90 శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని అన్నారు. ఇలా చేయడంవల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని అన్నారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్‌ చేస్తున్నామని అన్నారు. కోవిడ్‌ వచ్చేనాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదని ఇప్పుడు ప్రతి పదిలక్షలమందికి 47వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాల్లో ల్యాబ్‌లు ఉన్నాయి, టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామని అన్నారు.

దాదాపు 2 లక్షలమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని అవసరమైన వారికి అందరికీ టెస్టులు చేస్తున్నామని అన్నారు. ప్రతి రోజూ 9 వేల నుంచి 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామని అన్నారు. దాదాపు 37 వేలకు పైగా బెడ్లు ఉన్నాయని 109 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉన్నాయని అన్నారు. 56 వేలకు పైగా బెడ్లు ఉన్నాయని, గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిబెడ్లు కేవలం 3286 మాత్రమే ఉండేవని ప్రస్తుతం 11వేలకుపైగా ఉన్నాయని వివరించారు.

గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామని అన్నారు. హెల్ప్‌ డెస్క్‌లను పెట్టామని పేషెంట్లను త్వరగా అడ్మిట్ చేయించడానికి వీరు సహాయపడుతున్నారని అన్నారు. ప్రతి మండలంలో 108 అంబులెన్స్‌ ఉన్నాయని, కోవిడ్‌ కు ముందు 108 అంబులెన్స్ లు 443 ఉంటే, కోవిడ్‌ సమయంలో మరో 768 అంబులెన్స్‌లు సమకూర్చుకున్నామని 108, 104లు కలిపి కొత్తగా 1088పైగా తీసుకొచ్చామని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు మాకు లేవన్న ఆయన ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలికసదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవని అన్నారు. రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు.